
కానీ, ఆ భూములను కొంతమంది రైతులు పూలింగ్ విధానంలో ఇవ్వడానికి నిరాకరించారు. వారి అభిప్రాయం ప్రకారం, గతంలో ఇచ్చిన భూములకు సక్రమమైన అభివృద్ధి జరగకపోవడం, వాగ్దానాలు ఆలస్యంగా నెరవేర్చడం వంటి కారణాలతో మళ్లీ భూములు ఇవ్వడానికి వారు ఇష్టపడడం లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి మున్సిపల్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి నారాయణ అనేక సార్లు రైతులతో సమావేశమై చర్చించారు. ఆయన రైతులకు నమ్మకమిస్తూ, గతంలో అమలు చేసినట్లే ఇప్పుడు కూడా లాభదాయకమైన ప్యాకేజీ ఇస్తామని చెపుతున్నారు.
పూలింగ్ ద్వారా ఇచ్చిన భూములపై రైతులకు ఓపెన్ ప్లాట్లు, వాణిజ్య భూములు కేటాయిస్తామని, అలాగే కౌలు చెల్లింపులు కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. అయినా రైతులు ఇంకా వెనుకడుగు వేస్తుండటంతో తాజాగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ భూములను భూ సేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలని ఆదేశించారు. అంటే ఇకపై రైతులు స్వచ్ఛందంగా ఇవ్వకపోయినా, చట్టబద్ధంగా భూములు సేకరించనున్నారు. ఈ విధానంతో ప్రభుత్వానికి తక్షణ ఆర్థిక భారం పడనుంది, ఎందుకంటే భూసేకరణలో రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలి. అదనంగా, వారికి ఇతర ప్రయోజనాలు మరియు ప్రత్యామ్నాయ భూములు కూడా కేటాయించాల్సి ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక భారం భరించేందుకు సిద్ధంగా ఉండడం, అమరావతి నిర్మాణంపై సీఎం చంద్రబాబుకు ఉన్న ధృక్పథానికి నిదర్శనమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, ఈ నిర్ణయం భవిష్యత్తులో రైతుల వైఖరిపై ప్రభావం చూపవచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు. భూసేకరణ విధానంలో తక్షణ ప్రయోజనాలు ఎక్కువగా ఉంటే, మిగతా రైతులు కూడా భూములు ఇవ్వడానికి ముందుకు రావచ్చని కొందరు చెబుతుండగా, మరికొందరు దీని వల్ల రైతులలో అనుమానాలు పెరిగే అవకాశం ఉంది.