అంచనాలకు అనుగుణంగా వరస సెలవులు తరువాత మొన్న ప్రారంభం అయిన స్టాక్ మార్కెట్ ఆకాశాన్ని తాకుతు చెలరేగి పోవడంతో ఆ పరుగులు రెండవరోజు కూడ కొనసాగుతాయి అని చాలామంది భావించారు. అయితే ఊహించని విధంగా స్టాక్ మార్కెట్ అప్పుడప్పుడు చిన్న బ్రేక్ పడటం మదుపర్లకు షాక్ ఇచ్చింది.


ఏడాది క్రితంతో పోలిస్తే దేశంలో జిఎస్టీ వసూళ్లు పెరగడం కరోనా వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రాబోతోంది అన్న సంకేతాలు రావడంతో స్టాక్ మార్కెట్ పెట్టే పరుగులను చూసి చాలామంది ఈ వారాంతానికి నిఫ్టీ 13,500 పాయింట్లకు చేరుకుంటుందని అంచనాలు వేసుకున్నారు. అయితే నివురుకప్పిన నిప్పుగా కరోనా రెండవ దశ పొంచి ఉంది అన్న వార్తలు గుప్పుమనడంతో పాటు అమెరికా యూరప్ దేశాలలో కరోనా కేసులు రెట్టింపు కావడం మన దేశంలో ఢిల్లీ కేరళ మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాలలో కరోనా కేసులు ఉధృతంగా పెరిగిపోతున్న పరిస్థితులలో స్టాక్ మార్కెట్ లోని మదుపర్లు సేఫ్ గేమ్ ఆడటం మొదలు పెట్టడంతో మళ్ళీ స్టాక్ మార్కెట్ కు చిన్న బ్రేక్ పడింది.


దీనికితోడు సెబీ మార్కెట్ నియంత్రణ కోసం కొత్తగా తీసుకువచ్చిన కొత్త మార్జిన్ నిబంధనల వల్ల ఇంట్రాడే ట్రేడింగ్ పరిమాణం తగ్గడంతో షేర్ల ధరలు దిద్దుబాటు  చర్యలకు లోనయ్యాయి. ప్రస్తుతం సెబీ అనుసరిస్తున్న మార్జిన్ నిబంధనలకు బదులుగా కొత్త నిబంధనలు తీసుకు రావడంతో మార్కెట్ లో ఇంట్రాడే ట్రేడింగ్ చేసే మదుపర్లు వెనకడుగు వేసారు.


దీనివలన కూడ స్టాక్ మార్కెట్ లో కొంతమేరకు ఒడుదుడుకులు వచ్చాయి అన్న సంకేతాలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ డాలర్ తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 37 పైసలు పెరగడం బంగారం ధర పడిపోవడంతో చిన్న చిన్న అడ్డంకులు ఏర్పడ్డా ఈ వారాంతానికి షేర్ మార్కెట్ సెన్సెక్స్ – నిఫ్టీ లు మరో మెట్టు ఎక్కడం ఖాయం అని విశ్లేషకుల అంచనాలు ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: