తెలుగు సినీ ఇండస్ట్రీలో దిగ్గజ నటులు అక్కినేని నాగేశ్వరరావు శత
జయంతి ఉత్సవాలు హైదరాబాదులోనే
అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా నిర్వహించారు.
అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్ఆర్ విగ్రహ ఆవిష్కరణ తో శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరు కాగా ఆయన చేతుల మీదుగా ఏఎన్ఆర్ పంచలోహ విగ్రహావిష్కరణ జరిగింది. వెంకయ్య నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించిన సమయంలో నాగార్జున ఎంతో ఎమోషనల్ అవుతూ పూలతో తన తండ్రికి నివాళులు అర్పించారు. ఏఎన్ఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా వెంకయ్య నాయుడు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు." నాకు నాగేశ్వరావు అంటే చాలా అభిమానం. ఈ విగ్రహం లో జీవ కల ఉట్టిపడుతోంది. ఆయనే నిజంగా నిలబడ్డారా అనేలా ఉంది. ఏఎన్ఆర్ మహానటుడు. గొప్ప వ్యక్తిత్వం ఉన్న మహామనిషి. నేను, ఆయన అనేక విషయాలు పై మాట్లాడుకునే వాళ్ళం. ఆయన జీవితమంతా నటిస్తూనే ఉన్నారు. ఆఖరి రోజు వరకు నటించిన నటుడు నాకు తెలిసి చిత్ర పరిశ్రమలో మరొకరు లేరు. సినిమా రంగంలో విలువలు పాటించిన వ్యక్తి నాగేశ్వరరావు. ఆయన చూపిన మార్గంలో ప్రయాణించడం ఆయనకు మనం ఇచ్చే నివాళి. ఆయన భాష, వేషం, వ్యక్తిత్వం వీటిలో కొంతైనా మనం అందిపుచ్చుకోవాలి. వాళ్ల కుటుంబమంతా తెలుగులో మాట్లాడడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది.ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు భాష కనుమరుగవుతేందేమోనని భయం పుడుతుంది. పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. తెలుగు అంటే నాగేశ్వరరావు కు చాలా అభిమానం. భాష పోతే శ్వాస పోతుంది. శ్వాస పోతే అంతా పోతుంది. అందుకే మన భాషను ఎప్పటికీ మర్చిపోకూడదు. అందరూ తెలుగులో మాట్లాడాలి" అని అన్నారు. " తెలుగు సినీ రంగానికి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్ళ లాంటివారు. నాగేశ్వరరావు తన జీవితానికి ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకునేవారు. ఎలాంటి సినిమాలో అయినా ఒదిగిపోయేవారు. ఆయన ఒక నట విశ్వవిద్యాలయం. తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు. ఆయన జీవితాన్ని చదివారు అంటూ వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. .