తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందారు జయప్రకాశ్ రెడ్డి. చిన్నతనం నుంచి నటనపై ఉన్న ఆసక్తితో నాటక రంగంలోకి అడుగుపెట్టారాయ‌న‌. `అలెగ్జాండర్` అనే నాటకంలో ఏకపాత్రాభినయం చేసి 100 నిమిషాల పాటు ప్రదర్శన ఇచ్చారు. ఈ నాటకం ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నాటకాల్లో నటిస్తూనే.. చదువును పూర్తి చేశారు. సినిమాల్లోకి రాకముందు మున్సిపల్‌ స్కూల్లో గ‌ణిత ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు.


1988లో `బ్రహ్మపుత్రుడు` చిత్రంతో జయప్రకాశ్ రెడ్డి వెండితెరపై అడుగుపెట్టారు 1999లో విడుదలైన `సమరసింహారెడ్డి` చిత్రంతో ఆయనకు బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. కెరీర్ ఆరంభంలో రాయలసీమ మాండలికంలో విలనిజాన్ని పండించిన జయప్రకాశ్ రెడ్డి.. ఆ తర్వాత కాలంలో అదే మాండలికంతో హాస్యనటుడిగానూ ఓ వెలుగు వెలిగారు. తనదైన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకుని 74 ఏళ్ల వ‌య‌సులో మ‌ర‌ణించారు. నటుడిగా జయప్రకాశ్ రెడ్డి అందరికీ సుపరిచితమే. కానీ ఆయన వ్యక్తిగతం జీవితం గురించి పెద్దగా ఎవ‌రికీ అవ‌గాన‌ లేదు. అస‌లు ఆయ‌న‌కు ఇద్ద‌రు భార్య‌ల‌న్న సంగ‌తి కూడా చాలా మందికి తెలియ‌దు.


తాజాగా జయప్రకాశ్ రెడ్డి పర్సనల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని సంచలన నిజాల‌ను ఆయ‌న కూతురు మ‌ల్లిక‌ వెలుగులోకి తీసుకొచ్చారు. రాయలసీమకు చెందిన వ్యక్తిగా పాపులర్ అయిన జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి వాస్త‌వానికి గుంటూరు వాసి. గణితంలో డిగ్రీ పూర్తి చేసి, ఉపాధ్యాయ శిక్షణ పొందారు. 1979 నుండి 1981 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అలాగే 22 ఏళ్ల వయసులోనే జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డికి వివాహం జ‌రిగింది. కానీ 8 ఏళ్లు గడిచినా మొద‌టి భార్య ద్వారా ఆయనకు సంతానం కలగలేదు. దాంతో జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డికి ఆయ‌న త‌ల్లిదండ్రులు రెండో వివాహం జ‌రిపించారు. రెండో భార్య ద్వారా జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి ఒక కొడుకు, కూత‌రుకు జ‌న్మ‌నిచ్చారు.


ఇక నాట‌కాలే ఆయ‌న్ను సినిమా రంగం వైపు న‌డిపించారు. అయితే కెరీర్ ఆరంభంలో పలు సినిమాలు చేసినా స‌రైన గుర్తింపు రాక‌పోవ‌డంతో.. 1992లో జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి ఇండ‌స్ట్రీని విడిచి గుంటూరుకి వచ్చేశారు. కొన్నాళ్ల పాటు ఊర్లోనే ట్యూషన్స్ చెప్పుకున్నారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ సినిమా అవ‌కాశాలు వ‌స్తుండ‌టంతో `ప్రేమించుకుందాం రా` మూవీతో జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి ఇండ‌స్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వ‌డం జ‌రిగింద‌ట‌.  

మరింత సమాచారం తెలుసుకోండి: