
హెచ్‌డీ క్వాలిటీతో ఆన్‌లైన్‌లో కన్నప్ప పైరసీ ప్రింట్ దర్శనం ఇవ్వడంతో.. ఎన్నో నెలల నుంచి చిత్రబృందం పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయింది. ఈ విషయం తెలుసుకున్న హీరో మంచు విష్ణుకు హార్ట్‌బ్రేక్ అయింది. తాజాగా తన బాధను సోషల్ మీడియాలో వేదికగా వ్యక్తపరిచారు. పైరసీని ప్రోత్సహించవద్దంటూ విజ్ఞప్తి చేశాడు. `ప్రియమైన సినిమా ప్రియులారా, కన్నప్ప పైరసీ దాడిలో ఉంది. ఇప్పటికే 30 వేలకి పైగా అక్రమ లింక్‌లను తొలగించాము. ఇది నిజంగా హృదయ విదారకం.
పైరసీ అంటే దొంగతనం.. ఎలాగైతే మనం పిల్లలకు దొంగతనం చేయొద్దని నేర్పిస్తామో.. అలాగే పైరసీ కంటెంట్ చూడొద్దని కూడా చెప్పాలి. దయచేసి పైరసీని ప్రోత్సహించవద్దు. సినిమాను సరైన మార్గంలో సపోర్ట్ చేయండి. హర్ హర్ మహాదేవ్` అంటూ మంచు విష్ణు పోస్ట్ పెట్టాడు. కాగా, హిందూ ఇతిహాస భక్తి చిత్రమే కన్నప్ప. మంచు విష్ణు టైటిల్ పాత్రను పోషించగా.. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్స్ ఎందరో భాగమైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలను దక్కించుకుంది. భారీ ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. ఇటువంటి టైమ్ లో సినిమా పైరసీ బారిన పడటంతో కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.