1986లో విడుదలైన సీతారామ కళ్యాణం సినిమా ఆ కాలంలోనే కాదు, ఇప్పటికీ మధురానుభూతిని కలిగించే సినిమాల్లో ఒకటి. “కళ్యాణ వైభోగమే శ్రీసీతారాముల కళ్యాణమే మన మాంగళ్యధారణ శుభలగ్నమే” అనే పాటతో ఈ సినిమా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆత్రేయ రాసిన పదాలు, కె.వి. మహదేవన్ అందించిన స్వరాలు, బాలు – సుశీలమ్మ గాత్రాలు కలసి ఈ పాటను ఒక మాణిక్యంగా చేశాయి. జంధ్యాల దర్శకత్వం, ఆహ్లాదకరమైన చిత్రీకరణ ఈ పాటకు మరో మెరుపు తెచ్చాయి. కథ చాలా సింపుల్ అయినా, అందులోని భావోద్వేగాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. రెండు గ్రామాల మధ్య సీతారాముల విగ్రహాల గొడవ, బావా – మరదళ్ళ ప్రేమ, పెద్దవారి అడ్డంకులు, చివరికి సీతారాములు కలిసినట్టే ఆ ప్రేమ కూడా కలవడం – అన్నీ ప్రేక్షకుల హృదయాలను తాకాయి. టైటిల్ నుంచే సినిమా హిట్ అయ్యేలా ఒక శుభవాతావరణం సృష్టించబడింది.


బాలకృష్ణ – రజని జంట స్క్రీన్‌పై చాలా ఫ్రెష్‌గా కనిపించింది. కాలేజీ ప్రేమ, సైట్ కొట్టడాలు, చిలిపి చేష్టలు ప్రేక్షకులను తమ యువకాళ్ల రోజుల్లోకి తీసుకెళ్లాయి. ఇద్దరి డ్యూయెట్లు – “సరిగమపదనీ”, “ఎమని పాడెనో”, “రాళ్లల్లో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు” – అద్భుతంగా నిలిచాయి. ముఖ్యంగా త్యాగరాజు కీర్తన ఆధారంగా చేసిన పాటలో బాలయ్య మారువేషం తన తండ్రి వారసత్వాన్ని గుర్తు చేసింది.జంధ్యాల సినిమాల్లో కామెడీకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందనేది అందరికీ తెలుసు. కానీ ఈ చిత్రంలో మాత్రం మసాలా, యాక్షన్, గ్రామీణ పంతాలు కూడా బాగా కలిపారు. అలా జంధ్యాల ముద్ర కంటే మురారి ముద్ర ఎక్కువగా కనబడినా, సినిమా మొత్తానికి రుచికరంగా తయారైంది.



మిగతా పాత్రల్లో జగ్గయ్య, రామకృష్ణ, గొల్లపూడి, రాజేష్, గిరీష్, అరుణ, సంగీత, రమాప్రభ, శుభలేఖ సుధాకర్, సుత్తి వేలు వంటి కళాకారులు బలమైన నటన కనబరిచారు. కె.వి. మహదేవన్ స్వరపరిచిన నేపథ్య సంగీతం కూడా సినిమాకు అదనపు బలం ఇచ్చింది.మొత్తానికి సీతారామ కళ్యాణం బాలకృష్ణ కెరీర్ ప్రారంభ దశలో వచ్చిన అందమైన సినిమా. ఫ్యాక్షన్, బీభత్సం రాకముందు, బాలయ్యను గ్లామర్ బాయ్‌గా, ఫ్యామిలీ హీరోగా చూపించిన అందమైన క్షణాల్లో ఇది ఒకటి. ఈ సినిమాను ఇప్పటికీ యూట్యూబ్‌లో చూడవచ్చు. చూసినవారికి పాత మధురానుభూతులు మళ్లీ గుర్తుకొస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: