వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నిత్యానంద స్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. అహ్మదాబాద్ పోలీసులు నిత్యానందపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిత్యానంద ఇప్పటికే దేశం విడిచిపెట్టి వెళ్లిపోయి ఉండవచ్చని కూడా తెలుస్తోంది. నిత్యానంద దేశం విడిచి వెళ్లిపోయి ఉంటే నిత్యానందకు సహకరించింది ఎవరు అనే విషయం తెలియాల్సి ఉంది. నిత్యానంద స్వామి అంటే దేశంలో తెలియనివారు దాదాపు ఉండరు. 
 
అహ్మదాబాద్ పోలీసులు నిత్యానంద శిష్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. నిత్యానంద స్వామి ఇద్దరు బాలికలను అహ్మదాబాద్ లో విరాళాలు సేకరించాడని ఒత్తిడి చేసి బాలికలను హిప్నటైజ్ చేసి ఒక గదిలో బంధించాడని సమాచారం. ఈ కేసులో ఇప్పటికే నిత్యానంద స్వామి శిష్యురాళ్లైన ఇద్దరిని అరెస్ట్ కూడా చేశారని సమాచారం. అరెస్ట్ చేసిన ఇద్దరు శిష్యురాళ్లు అహ్మదాబాద్ లో నిత్యానంద ఆశ్రమానికి ఇంఛార్జ్ లు అని తెలుస్తోంది. 
 
నిత్యానంద ఆచూకీ మాత్రం పోలీసులకు లభించటం లేదు. బుధవారం రోజున నిత్యానందపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు కిడ్నాప్, నిర్భంధం కేసులు నిత్యానంద పై నమోదు చేశారు. పోలీసులు నిత్యానంద కోసం ఒక ప్రత్యేక బృందం ద్వారా గాలింపు చర్యలు చేపట్టారని సమాచారం. పోలీసులకు నిత్యానంద ఆచూకీ లభించకపోవటంతో నిత్యానంద విదేశాలకు వెళ్ళి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
నిత్యానంద పాస్ పోర్టును మాత్రం సీజ్ చేయలేదని తెలుస్తోంది. ఆ ఇద్దరు అమ్మాయిలు బెంగళూరుకు చెందిన జనార్ధనస్వామి దంపతుల కుమార్తెలు అని తెలుస్తోంది. పోలీసులు ఇప్పటికే అమ్మాయిల స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. ఇద్దరు అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో గుజరాత్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. బీజేపీ ప్రభుత్వం నిత్యానంద స్వామిని రక్షిస్తోందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. నిత్యానంద ఆచూకీ దొరికితే ఈ కేసులో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: