ఇన్ సైడర్ ట్రేడింగ్.. ఇప్పుడు ఈ పదం తెలియని వారు ఉండరు. రాజధాని భూముల్లో టీడీపీ ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందన్నది వైసీపీ ఆరోపణ. రాజ్యాంగ మీద ప్రమాణం చేసి ప్రభుత్వపరంగా తీసుకున్న నిర్ణయాలను బహిర్గతం చేయనని చెప్పిన చంద్రబాబు అమరావతిలో తన కోటరీతో భూములు కొనుగోలు చేయించి రాజద్రోహానికి పాల్పడ్డాడని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు ఏర్పాటు చేసుకున్న దొంగల ముఠాకు ఆపద వచ్చిందని గ్రహించే.. టాపిక్ డైవర్ట్ చేసే పనిలో ఉన్నారని వైసీపీ ఆరోపిస్తోంది.



రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని... రాజధాని ప్రకటనకు ముందే తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో చంద్రబాబు తన బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేశారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పామని వైసీపీ ఎమ్మెల్యేలు గుర్తు చేసుకుంటున్నారు. అయినా పట్టించుకోలేదు. ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తీసుకురావాలనే ఆకాంక్షతో సీఎం వైయస్‌ జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని వారు చెబుతున్నారు.



అంతే కాదు.. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా వైసీపీ నేతలకు ఏ పాపం తెలియదట. సెంటు భూమి కూడా కొనలేదని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే విచారణ చేయించి శిక్షించాలని గతంలో జగన్ అసెంబ్లీలో కోరిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పైన సమగ్ర విచారణ కోసం ప్రభుత్వం బిల్లు పాస్‌ చేసింది.. ఈ రోజున ఐటీ దాడులు జరుగుతున్నాయి.



ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో భూములు కొనుగోలు చేసిన వారి వివరాలు తీస్తే ప్రత్తిపాటి పుల్లారావు కారు డ్రైవర్, పత్తి మిల్లులో పనిచేసే వర్కర్, నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్లు.. ఇలాంటి వారి బాగోతాలు బయటకు వస్తుంటే చంద్రబాబు దిక్కుతోచని పరిస్థితుల్లో సముద్రంలోంచి ఒడ్డునపడిన చాపలా గిలగిలా కొట్టుకుంటున్నాడు. చంద్రబాబుకు లెఫ్ట్, రైట్‌గా ఉన్న సుజనా చౌదరిపై గతంలో ఐటీ, ఈడీ దాడులు జరిగాయి. సుజనా చౌదరిని, సీఎం రమేష్‌ లాంటి వారిని బీజేపీలోకి పంపించినా.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ బహిర్గతం అవుతున్నాయని బాబుకు భయం పట్టుకుందని వైసీపీ ఆరోపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: