ఏపీ జగన్ సీఎం తొమ్మిది నెలల పాలన పూర్తి చేసుకున్నారు. ఈ తొమ్మిది నెలల్లో ఎన్నో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. అయితే జగన్ తన తొమ్మిది నెలల పాలనలో నవ మోసాలు చేశారంటూ టీడీపీ ప్రచారం చేస్తోంది. ఇదే అంశం చెబుతూ చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రలు చేస్తున్నారు. సోమ వారం చంద్రబాబు తన సొంత నియోజక వర్గం కుప్పంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు.

 

ఆ యాత్రలో జగన్ ది నరకాసుర పాలన అంటూ విరుచుకుపడ్డారు. అయితే చంద్రబాబు విమర్శలను వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు. చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర ప్రారంభించి..అబద్ధాలు, అవాకులు, చవాకులు పేలుస్తున్నారంటూ మండిపడుతున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పట్టుమని పది మంది కూడా చంద్రబాబు మీటింగ్‌ కు హాజరు కాలేదంటున్నారు మంత్రి కన్నబాబు.

 

అందుకే టీవీలు ఎంతసేపు చంద్రబాబును క్లోజప్‌లో చూపించారే తప్ప జనాన్ని చూపించలేదని ఆరోపించారు. ఇప్పటికే ప్రజలు చైతన్యవంతమైన టీడీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో తొలగించారని మంత్రి కన్నబాబు అన్నారు. ప్రజా చైతన్యమంటే ఏంటో చూపించారు.. ఆ ప్రజా చైతన్యం ఎంత గట్టిగా ఉంటుందో అని చంద్రబాబుకు తగిలిన దెబ్బతో అర్థమైందన్నారు మంత్రి కన్నబాబు.

 

ప్రజలను మభ్యపెట్టేందుకే చంద్రబాబు రోడ్డెక్కారని.. అసలు చంద్రబాబు ప్రజలను ఏమని చైతన్యపరుస్తారు? ఎక్కడైనా ప్రతిపక్ష పాత్రలో ఉన్నవారు అధికార పార్టీకి సమయం ఇస్తారు. అవసరమైతే సలహాలు, సూచనలు ఇస్తారు. ఎన్నికల సమయంలో వేడెక్కించేలా మాట్లాడుతారు. కానీ చంద్రబాబు మాత్రం వైయస్‌ జగన్‌పై బురద జల్లే కార్యక్రమానికి తెర లేపారు. లేనిది ఉన్నట్లు అబద్దాలు చెబుతున్నారు. ఇది నరకాసుర పరిపాలన అంటూ చంద్రబాబు చంద్రబాబు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు మంత్రి కన్నబాబు.

 

తొమ్మిది నెలల్లో ఏం నరకాసుర పరిపాలన జరిగింది? అమ్మ ఒడి కింద రూ.15 వేలు ఇవ్వడం నరకాసుర పాలనా? రైతులకు పెట్టుబడి సాయం చేయడం తప్పా? ఆటోడ్రైవర్లు, చేనేత కార్మికులకు ఆర్థికసాయం చేయడం వల్ల నరకాసురుడా.. జగనన్న వసతి దీవెన, కంటి వెలుగు పేరుతో వైద్యం చేయిస్తే జగన్‌ నరకాసురుడు అయ్యారా?. పాఠశాల విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తుంటే నరకాసురుడు అయ్యాడా?. లక్ష 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు నరకాసురుడు అయ్యారా? ఎవరైనా పేదవాడి పొట్ట కొడుతారా అని ప్రశ్నిస్తారని... కానీ చంద్రబాబు మాత్రం తాగుబోతుల పొట్ట గొడుతారా అని నిలదీశారని మంత్రి కన్నబాబు గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: