ఎవరిని ఏవిధంగా కంట్రోల్ చేయాలి అనే విషయం ఏపీ సీఎం జగన్ కు బాగా తెలుసు. వైసిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన వ్యవహార శైలి ని చూస్తే ఈ విషయం బాగా అర్థమవుతోంది. జగన్ తీసుకున్న నిర్ణయాలు కానీ, మరేదైనా కానీ, ముందు వివాదాస్పదం అవ్వడం, ప్రతిపక్షాలు దీనిపై రాద్దాంతం చేయడం, ఆ తర్వాత అందరూ జగన్ నిర్ణయానికి జై కొట్టడం ఇవన్నీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల కాలం నుంచి జనాలు చూస్తూనే ఉన్నారు. ప్రతి పనిలోనూ, ప్రతి నిర్ణయంలోనూ తన మార్క్ ఉండేలా జగన్ జాగ్రత్త పడుతున్నారు. అధికారంలోకి వచ్చింది మొదలు, ప్రభుత్వంలో గానీ, పార్టీలో గానీ ఎక్కడా అవినీతి అనేది లేకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు జగన్ చేస్తున్నారు. 

 

IHG


ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు తీవ్ర స్థాయిలో ఉండేలా కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను సాధించడం ద్వారా, ఏపీ ప్రజలు తమ నిర్ణయాలకు మద్దతు పలుకుతున్నారని చూపించుకునేందుకు జగన్ ప్రయత్నిస్తుండగా,  అధికార పార్టీ కి ధీటుగా ఎన్నికల ఫలితాలు సాధించాలని టిడిపి భావిస్తోంది. ఇలా ఒకరికొకరు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ఉండగా, ఏపీ సీఎం జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలపై పూర్తిగా  దృష్టి పెట్టారు. ఈ మేరకు ఎన్నికల్లో అక్రమ మద్యం, డబ్బు పంపిణీ వంటి అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్ ను జగన్ తయారు చేయించారు. శనివారం తాడేపల్లి లో తన నివాసంలో నిఘా మొబైల్ యాప్ ను  జగన్ ఆవిష్కరించారు. 

 


మొబైల్ యాప్ సహాయంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. మద్యం, డబ్బు పంపిణీ తో పాటు ఎటువంటి అక్రమాలు అయినా యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉందని జగన్ వెల్లడించారు. ఎవరైనా ఈ మొబైల్ యాప్ ను సులభంగా డౌన్లోడ్ చేసే విధంగా అవకాశం కల్పించారు. అలాగే ఎన్నికల్లో ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నట్లు తెలిస్తే, మొబైల్ యాప్ ద్వారా సమాచారాన్ని అందిస్తే నేరుగా సెంట్రల్ కంట్రోల్ రూమ్ కు ఆ ఫిర్యాదు వెళ్లేలా ఏర్పాటు చేశారు. మొబైల్ యాప్ సామాన్యుడి చేతిలో అవినీతిపై అస్త్రం మారబోతుందని ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు. 

 


జగన్ ఎన్నికల నిర్వహణకు ఈ విధంగా ఏర్పాట్లు చేయడం చూస్తుంటే, ఈ ఎన్నికలను నిబంధనల మేరకు సమర్థవంతంగా అమలు చేయాలనే కృత నిశ్చయంతో జగన్ ఉన్నట్టు అర్థమవుతోంది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాగైనా సరే వాయిదా వేయించాలనే పట్టుదలతో రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా, అధికార పార్టీ మాత్రం ముందుగా అనుకున్న విధంగానే ఎన్నికలను నిర్వహించాలనే దృఢ నిశ్చయంతో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: