దేశంలోని అన్ని రాష్ట్రాలను కరోనా గజగజా వణికిస్తోంది. ఏపీలోని కొన్ని జిల్లాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో అత్యధికంగా 74 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లా ప్రజలు భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. కర్నూలు జిల్లాలో పల్లెల్లో కూడా కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. 74 కేసుల్లో 72 కేసులు ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారే కావడం గమనార్హం 
 
జిల్లాలో ఢిల్లీ ప్రార్థనలతో సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు కరోనా భారీన పడ్డారు. పాణ్యంకు చెందిన ఒక వ్యక్తి ఈ నెల 1న కరోనా లక్షణాలతో ఐసోలేషన్ వార్డులో చేరాడు. అతని నమూనాలను ల్యాబ్ కు పంపగా మూడో తేదీన చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందాడు. అతను ఢిల్లీకి వెళ్లనప్పటికీ ఢిల్లీ ప్రార్థనలకు హాజరైన వారిని కలవడం వల్ల అతనికి కరోనా సోకి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
స్థానికంగా ఉండే మరో వ్యక్తికి కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 28 కరోనా కేసులు నమోదయ్యాయి. అధికారులు జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో  కేసులు నమోదైన వారి సన్నిహితులను, బంధువులను క్వారంటైన్ కేంద్రాలకు తరలించకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
 
పోలీస్ శాఖ జిల్లాలోని 27 ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించింది. కరోనా బాధితుల కాలనీల చుట్టూ దారులను మూసివేసింది. జిల్లాలో మరో 45 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. అధికారులు నిన్న సాయంత్రం వరకు 675 మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. కొత్తగా జిల్లాలోని శ్రీ చైతన్య కళాశాల, ప్రజానగర్ లోని భవనాలను అధికారులు క్వారంటైన్ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది. ఈరోజు రాష్ట్రంలో 15 కొత్త కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 329కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: