కరోనాకు ఎవరూ అతీతం కాదు.. ఈ విషయం జర్నలిస్టులకూ వర్తిస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా జర్నలిస్టులు కూడా కరోనా బారిన పడుతున్నారు. మొన్న ముంబైలో దాదాపు 50 మంది వరకూ కరోనా బారిన పడ్డారు. జర్నలిస్టులకు కరోనా వచ్చిన కారణంగా తమిళనాడులో ఏకంగా ఓ ఛానల్ ప్రసారాలే పూర్తిగా ఆగిపోయిన సంగతి తెలిసిందే.

 

 

తెలుగు రాష్ట్రాల్లోనూ క్షేత్ర స్థాయిలో పని చేసే జర్నలిస్టులకు కరోనా వచ్చిందని వార్తలు వచ్చాయి. ప్రత్యేకించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో నలుగురు ఐదుగురు జర్నలిస్టులకు కరోనా వచ్చిందని తెలిసింది. అందుకే ఇప్పుడు న్యూస్ ఛానళ్లు కూడా జాగ్రత్త పడుతున్నారు. ఎవరో ఒక రిపోర్టర్‌ కు కరోనా వస్తే అది చానల్ నిర్వహణపై పెద్దగా ప్రభావం చూపదు. మరి అదే డెస్కులో కరోనా వస్తే.. ఇప్పుడు చానళ్ల నిర్వహాకులు ఈ విషయంపైనే దృష్టి సారించారు.

 

 

మరి డెస్కు జర్నలిస్టులకు కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎలా.. ఎందుకంటే.. దాదాపు అన్ని ప్రధాన తెలుగు న్యూస్ ఛానళ్ల ప్రధాన కార్యాలయాలు అన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. అందులోనూ జర్నలిస్టులు ఒక్కో ప్రాంతంలో నివసిస్తుంటారు. వారు ఆఫీసుకు వచ్చిపోతుంటారు. అలాంటప్పుడు కరోనా వ్యాప్తిని అడ్డుకునేదెలా..? ఈ అంశంపై ఛానళ్ల నిర్వాహకులు మల్లగుల్లాలు పడుతున్నారు.

 

 

డెస్క్ లో ఏ ఒక్కరికి కరోనా వచ్చినా.. ఆ తర్వాత అది చానల్ మూసివేత వరకూ దారి తీసే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు కొన్ని చానళ్లు అసలు డెస్క్ జర్నలిస్టులకు ఆఫీసులోనే బస కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో పడ్డాయట. దాదాపు 14 రోజులపాటు ఒకే షిఫ్టు వేయడం.. ఆఫీసు పని గంటలు ముగిసిన తర్వాత కూడా ఆ 14 రోజులు ఆఫీసు కల్పించిన బసలోనే ఉండిపోవాలని అంటున్నారట. అంటే పెళ్లాం పిల్లలకు దూరంగా 14 రోజుల పాటు ఉండాలన్నమాట.

 

 

ఇలా చేస్తే కొంత వరకూ కరోనా బారి నుంచి ఛానళ్లను కాపాడుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారు.ఓ రెండు ప్రధాన చానళ్లు ఈ ప్రయోగం చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఎంత వరకూ ఈ 14 రోజుల ప్రయత్నం ఫలిస్తుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: