తెలంగాణ రాజకీయాలకు ఉస్మానియా ఆసుపత్రి కేంద్రంగా మారింది. వివిధ రాజకీయ పార్టీల నేతలు ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్..బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆస్పత్రిలోకి వర్షపు నీరు చేరటం సర్కారు పని తీరుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో పేదల పెద్దాసుపత్రి ఉస్మానియా. దూర ప్రాంతాల నుంచి చాలా మంది ఇక్కడికి వైద్యం కోసం వస్తుంటారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఆస్పత్రిలోకి వరద నీరు వచ్చి చేరింది. పేషంట్లు చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో రాజకీయ పక్షాలు అన్ని ఆస్పత్రిలోకి ఎంట్రీ ఇచ్చాయి. ఉస్మానియా ఆస్పత్రి రాజకీయాలకు వేదికగా మారింది.
ప్రభుత్వానికి సాగునీటి ప్రాజెక్టుల మీదున్న శ్రద్ధ ఆస్పత్రులపై లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఉస్మానియాలో పరిస్థితిని బండి సంజయ్‌తో పాటు ఇతర నేతలు పరిశీలించారు. రోగులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు బండి సంజయ్.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో టిపిపిసి చీఫ్ ఉత్తమ్‌తో పాటు పలువురు నేతలు ఉస్మానియాని సందర్శించారు. ఆస్పత్రి నూతన భవనాన్ని వెంటనే నిర్మించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఉస్మానియా హాస్పిటల్‌లోకి నీళ్ళు రావటం అంటే సీఎం కేసీఆర్ సిగ్గుతో తల దించుకోవాలని పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడితే హైదరాబాద్ విశ్వనగరం అంటారని...ఉస్మానియా ఆస్పత్రిని చూస్తేనే ఆ విషయం తెలుస్తుందని ఎద్దేవా చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఈ దుర్మార్గపు పాలన వదిలించుకోవాలని తెలంగాణ పిలుపునిచ్చారు. ఉస్మానియా ఆస్పత్రిలోకి వర్షపు నీరు రావడంపై ప్రతిపక్షాలు చిర్రుబుర్రులాడుతున్నాయి. రోగులు పడుతున్న అవస్థలను చూసి అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి.
మొత్తానికి ఉస్మానియా ఆస్పత్రి తెలంగాణ రాజకీయాలకు వేదికగా మారింది. ఇప్పటికైనా ఆస్పత్రిలో పరిస్థితులను చక్కదిద్దాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. చుద్దాం.. ఈ ఘటనపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో.. !
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి