తాజాగా కీల‌క మ‌లుపు తిరిగిన ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి అంశం.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మ‌రిన్ని చిక్కులు తెచ్చిందా ? ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్ర ఏదో విధంగా ఆదుకుంటుంద‌ని, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీనే వ‌చ్చి.. ఇక్క‌డ శంకుస్థాప‌న చేశార‌ని చెబుతూ వ‌చ్చిన ఆయ‌న‌కు ఇప్పుడు కేంద్రం వ్య‌వ‌హ‌రించిన తీరు తీవ్ర శ‌రాఘాతంగా మారింది. ఎవ‌రూ కోర‌కుండానే హైకోర్టులో కేంద్ర ప్ర‌భుత్వం అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. ఈ క్ర‌మంలోనే రాష్ట్రానికి ఒకే రాజ‌ధాని అని విభజ‌న చ‌ట్టంలో ఎక్క‌డా లేద‌ని కేంద్రం స్ఫష్టం చేసింది. అదే స‌మ‌యంలో మూడు రాజ‌ధానుల‌కు ప‌రోక్షంగా అంగీక‌రించింది.

ఇక‌, రాజ్యంగంలోనూ రాష్ట్ర రాజ‌ధానుల విష‌యం కేంద్రం ప‌రిధిలో లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఇది పైకి వినేందుకు బాగున్నా.. చంద్ర‌బాబు చుట్టూ.. మ‌రిన్ని చిక్కులు తెచ్చిపెట్టింది. ఆయ‌న వ్యూహానికి, విజన్‌కు ఈ ప‌రిణామం.. తీవ్ర శ‌రాఘాత‌మ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌డిచిన ఐదేళ్ల‌లో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరును కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు స‌మ‌ర్ధించింద‌నే టీడీపీ నాయ‌కులు ఇప్ప‌టి వ‌ర‌కు చెబుతూ వ‌చ్చారు. రాజ‌ధాని కూడా కేంద్రం క‌నుస‌న్న‌ల్లోనే బాబు నిర్ణ‌యించార‌ని, అందుకే మోడీని పిలిచి మ‌రీ.. ఆయ‌న‌తో శంకుస్థాప‌న చేయించార‌ని విన్న‌విస్తూ.. వ‌చ్చారు.

అయితే, ఇప్పుడు పూర్తిగా వివ‌రాల‌తో కూడిన అఫిడ‌విట్‌లో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని చెప్ప‌డంతోపాటు.. మూడు రాజ‌ధానులు ఉన్నా.. త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని కూడా కేంద్రం స్ప‌ష్టం చేసేయ‌డం, గ‌త చంద్ర‌బాబు నిర్ణ‌యానికి త‌మ మ‌ద్ద‌తు లేద‌ని స్ప‌ష్టం చేయ‌డం మొత్తంగా.. చంద్ర‌బాబు ఏక‌ప‌క్షంగా తీసుకున్న నిర్ణ‌యం అన్ని రూపాల్లోనూ విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది. పైగా రాజ‌ధాని రైతులు ఇప్ప‌టి వ‌ర‌కు బాబు వ్యూహాన్ని, విజ‌న్‌ను న‌మ్ముకున్నారు. ఇప్పుడు అవే త‌ప్పుల త‌డ‌క‌లుగా నిరూపితం అయ్యే ప‌రిస్థితి ఏర్ప‌డ‌డంతో మ‌రింత‌గా బాబుకు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి బాబు ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: