టీడీపీలో పదవుల జాతర నడుస్తోది. ఓ వైపు సీఎం జగన్ ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులని భర్తీ చేస్తుంటే, మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీలో కీలక పదవులని భర్తీ చేస్తున్నారు.  ఇప్పటికే పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని నియమించారు. అలాగే మహిళా అధ్యక్షులని కూడా పెట్టారు. అటు సమన్వయకర్తలని కూడా నియమించారు. తాజాగా ఏపీ, తెలంగాణ పార్టీలకు అధ్యక్షులని పెట్టారు. ఏపీకి అచ్చెన్నాయుడుని, తెలంగాణకు ఎల్ రమణకు బాధ్యతలు అప్పగించారు.

ఇక పార్టీలో కీలకమైన పొలిట్‌బ్యూరో సభ్యులని కూడా ప్రకటించారు. పాతవారితో పాటు మరికొందరు కొత్త నేతలనీ పొలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారు. అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శులు, జాతీయ ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు, ఇతర పదవులని భర్తీ చేశారు. దాదాపు అన్నీ కీలక పదవులని కవర్ చేసిన బాబు, మరో కీలకమైన తెలుగు యువత అధ్యక్షుడుని మాత్రం ప్రకటించలేదు.

అసలు యువతని ఆకర్షించే కీలకమైన పదవిలో ఎవరిని పెట్టాలని చంద్రబాబు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు తెలుగు యువత అధ్యక్షుడుగా దేవినేని అవినాష్ పనిచేశారు. ఆయన వల్ల పార్టీకి చాలా ప్లస్ అయింది. కానీ అవినాష్‌కు వస్తున్న ఇమేజ్‌ని తటుకోలేని కొందరు టీడీపీ పెద్దలు, అతన్ని సైడ్ చేశారు. దీంతో అవినాష్ కూడా టీడీపీలో ఉన్న కుళ్ళు రాజకీయాలని తట్టుకోలేక, ఆ పార్టీని వదిలేసి ఇప్పుడు వైసీపీలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.

విజయవాడ తూర్పు ఇన్‌చార్జ్‌గా దూసుకెళుతున్నారు. ఇక అవినాష్ వెళ్ళాక తెలుగు యువత అధ్యక్ష పదవి భర్తీ కాలేదు. ఈ పదవిలోకి ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ అధ్యక్ష పదవి రామ్మోహన్ నాయుడుకు వస్తుందని ప్రచారం జరిగింది. కానీ రామ్మోహన్ ఎంపీగా ఉన్నారు. అలాగే ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి వచ్చింది. దీంతో తెలుగు యువత పరిటాల శ్రీరామ్‌కు దక్కొచ్చానే ప్రచారం జరుగుతుంది. అలాగే నాదెండ్ల బ్రహ్మం చౌదరీకి కూడా యువత దక్కే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి చూడాలి తెలుగు యువత బాబు ఎవరికి ఇస్తారో.

మరింత సమాచారం తెలుసుకోండి: