వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని అసెంబ్లీ లాంజ్‌లోంచి తొలగించిన స్పీకరు కార్యాలయం, నిబంధనలకు విరుద్ధంగా అది ఏర్పాటుచేశారంటూ సమర్థించుకున్న స్పీకరు అక్కడితో ఆ వ్యవహారానికి ఒక రకంగా ఫుల్‌స్టాప్‌ పెట్టారు. అయితే.. ఈ విషయాన్ని మరింతగా రచ్చకీడ్చి.. రభస చేయడానికి తెలుగుదేశం పార్టీ కంకణం ట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. శుక్రవారం నాడు సభలో కేవీపీ మీద సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడం, దాన్ని ఎథిక్స్‌ కమిటీకి పంపడం అనేవి దీనికి సంకేతాలుగానే ఉన్నాయి. కేవీపీ గనుక స్పీకరు ఎదుటకు వచ్చి క్షమాపణ చెప్పకపోతే.. ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు అంటున్న మాటలు కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి. 


ఏపీలో తెలుగుదేశం సర్కారు ఏర్పడిన తర్వాత.. ఏడాది తర్వాత అసెంబ్లీ లాంజ్‌లో వైఎస్సార్‌ చిత్రపటాన్ని కోడెల తొలగింపజేశారు. ఆ ఫోటోను తిరిగి ఏర్పాటు చేయాలంటూ.. ఈ తొలగింపు వైఎస్‌ ను అవమానించినట్లు ఉన్నదంటూ.. ఆయన మిత్రుడు కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ కేవీపీ స్పీకరుకు లేఖ రాశారు. అయితే వైఎస్‌ వర్ధంతి అయిన బుధవారం నాడు వైకాపా సభ్యులంతా ఫోటో తిరిగి పెట్టాల్సిందేనని గొడవ చేసినప్పుడు.. స్పీకరు కోడెల కేవీపీ లేఖను చర్చకు తెచ్చారు. తొలగింపు అనేది అనాగరికం, అక్రమం అంటూ కేవీపీ వాడిన పదాలు.. స్పీకరు స్థానాన్ని అవమానించేలా, సభను కించపరిచేలా ఉన్నాయంటూ తన అభిప్రాయం చెప్పారు. అవసరమైతే.. ఆయన మీద చర్య తీసుకుంటాం అని కూడా అన్నారు. 


నిజానికి స్పీకరు కోడెల అంతటితో ముగించారు గానీ.. పార్టీ దానిని సులువుగా వదిలిపెట్టదలచుకోలేదు. కేవీపీని పిలిచి సంజాయిషీ కోరాలని మంత్రి యనమల గురువారం నాడే ఓ హెచ్చరిక చేశారు. ఆయన క్షమాపణ కోరకుంటే.. జైలుకు పంపే అవకాశం ఉందని ఆయనే వెల్లడించారు. శుక్రవారం సభాహక్కుల ఉల్లంఘన నోటీసు కూడా వెళ్లింది. 


అయితే ఇప్పుడు రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావును శాసనసభకు పిలిపించి క్షమాపణ కోరుతారా లేదా? అనేది రాజకీయవర్గాల్లో చర్చగా ఉంది. యనమల తెలిసి అన్నారో తెలియక అన్నారో గానీ.. రాజ్యసభ ఎంపీ విషయంలో సభ స్పీకరు తన ఇష్టమొచ్చినట్లు చేయడానికి కుదర్దు. రాజ్యసభ చైర్మన్‌ అనుమతి కూడా అవసరం. అలాంటప్పుడు.. వీరి ఇష్టానుసారంగా కేవీపీని జైలుకు పంపేయడం సాధ్యమేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పైగా కేవీపీ టెక్నికల్‌గా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీ. ఇన్ని టెక్నికల్‌ అంశాలుండగా.. కేవీపీని జైలుకు పంపేయగలం అంటూ.. యనమల ఎవరిని బెదిరించడానికి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: