దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వ్యాక్సినేషన్, ఆక్సిజన్ కొరత వంటి అంశాల మీద కేంద్ర, బీజీపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పలు కీలక ఆరోపణలు చేస్తూ.. ట్విట్ చేశారు. కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా.. పలు రాష్ట్రాల పరిస్థితులను తెలుసుకోడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు జార్ఖండ్ సహా పలు రాష్ట్రాల సీఎంలకు కూడా ఫోన్ చేశారు. రాష్ట్ర పరిస్థితిపై ఆరా తీశారు. ఈ ఫోన్కాల్ తర్వాత సీఎం సోరెన్ దాని గురించి ట్వీట్ చేశారు. 


ఈ రోజు ప్రధాని మోదీ నాకు ఫోన్ చేశారని కానీ చేసి కేవలం ఆయన మనసులోని మాటనే చెప్పారని.. కట్టడికి ఏం చేయాలో చెబితే బాగుండేది, మా మాట కూడా వింటే బాగుండేది.. అంటూ సోరెన్ ట్విట్టర్ వేదికగా మోడీని విమర్శించారు..అయితే.. హేమంత్ సోరెన్ చేసిన వ్యాఖ్యలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తప్పు బడుతూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. కరోనాపై పోరాటంలో ప్రధాని మోదీకి అందరం అండగా ఉందామంటూ ట్విట్టర్ వేదికగా జగన్ సూచించారు. కేంద్రానికి సహకరించాల్సిన తరుణంలో వేలెత్తిచూపడం తగదని సోరేన్ కు హితవు పలికారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో రాజకీయాలు చేస్తే దేశం బలహీనమవుతుందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం సోరెన్ అంటే తనకెంతో గౌరవం ఉందని అంటూనే కరోనా సమయంలో రాజకీయాలు తగవని జగన్ హితబోధ చేశారు.

 అయితే అసలు సీఎం జగన్‌కు హిందీ రాదట, కానీ జార్ఘండ్ సీఎం హేమంత్ సోరెన్ హిందీలో ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్‌ను ఎవరైనా సలహాదారులు ట్రాన్స్‌లేట్ చేసి అర్థమయ్యేలా చెప్పారో లేక ఇంకెలా అయినా తెలిసిందో కానీ.. జగన్‌కు బాధేసి, ఒక బీజేపీ నేత బాధ పడినట్టుగా రిప్లయ్ ఇచ్చారు. సోదరా అని సంబోధించి.. హేమంత్ సోరెన్ రెండు లైన్ల ట్వీట్ చేస్తే జగన్ ఆరు లైన్ల మేర విమర్శలు గుప్పించారు. అసలు ఏపీకి ఏ మాత్రం సబంధం లేకపోయినా.. ప్రధాని నరేంద్రమోడీని బాహుబలిని చేయడానికి అన్నట్లు జగన్ విమర్శలు కురిపించడం… ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాక దేశ వ్యాప్తంగా పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక పక్క ఆంధ్రప్రదేశ్‌కు అడిగినన్ని వ్యాక్సిన్ డోసులు కానీ.. ఆక్సిజన్ కొరత కానీ తీర్చలేక పోయినా కేంద్రాన్ని అసలు ప్రశ్నించనే ప్రశ్నించని సీఎం జగన్ ఇప్పుడు మిగతా అందరికీ టార్గెట్ గా మారారు. 

 నరేంద్రమోడీ దృష్టిలో పడితే నాలుగు కాలాల పాటు చల్లగా ఉండచ్చని జగన్ ఇలా ప్రయత్నం చేసున్నారా ? లేక సొంత టీం తో కాకుండా తమకు బయట నుంచి మద్దతు ఇస్తున్న ఇలాంటి అప్రకటిత మిత్రపక్షాలతో కౌంటర్ స్ట్రాటజీని బీజేపీ అమలు చేయడం ప్రారంభించిందా.. అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. మోడీని విమర్శిస్తే, దేశం బలహీనం అవుతుందన్నట్లు జగన్ ట్వీట్ పెట్టడం బీజేపీ భావజాలంలాగే ఉంది. బీజేపీ కూడా మోడీని విమర్శిస్తే దేశ ద్రోహమే అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. దానికి తగ్గట్టే జగన్ మాట్లాడుతున్నారు. దీని మీద పెద్ద ఎత్తున జగన్ మీద సోషల్ మీడియా దాడి జరిగే అవకాశం ఉంది. 

ఇప్పటికే జగన్ ట్వీట్‌పై స్పందించిన ఒడిశా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలాకా రీట్వీట్ చేస్తూ.. రాజకీయ ప్రయోజనాల కోసం మోదీతో లాలూచీ పడడం సరికాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజశేఖరరెడ్డి లాంటి నేతకు కుమారుడివై ఉండీ ఇలా సీబీఐ, ఈడీ దాడులకు భయపడి ప్రధానికి దాసోహం కావడమేంటని ప్రశ్నించారు. 'ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి, మీరు మరింత ఎదగాలి' అంటూ ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఇక ఏపీలోని తెలుగు దేశం సోషల్ మీడియా సైతం జగన్ కేసుల గురించి రఘు రామ కృష్ణం రాజు కొత్త పిటిషన్లు వేస్తూ ఉండటంతో కాస్త సేఫ్ గా ఉండాలని మోడీ భజన మొదలు పెట్టారని విమర్శిస్తోంది. జ‌గన్ మెడ‌లో వైసీపీ కండువా... లోప‌ల బ‌నియ‌న్ కాషాయ‌మే అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు.

మరింత సమాచారం తెలుసుకోండి: