తెలంగాణా ప్రభుత్వం ఈరోజు లాక్డౌన్ ప్రకటించగానే జరిగిన ఆశ్చర్యకరమైన గుర్తించవలసిన అంశం ఏమంటే గుంపులు గుంపులుగా జనం వైన్ షాపుల ముందు "బౌతిక దూరం పాటించక పోగా కొందరైతే సరిగ్గా మాస్కులు కూడా పెట్టుకోకుండా వైన్ షాపుల ముందు పది రోజులకు సరిపడా మందు బాటిల్స్ కొనటం కనిచింది అదీ వందలు వేల రూపాయిలు ఖర్చుచేసి, వైన్ షాపుల్లో నిల్వలు సమాప్తం అయిపోయాయి" రాష్ట్రంలో మందు తాగేవాళ్ళే ఎక్కువ ఉన్నారని పించింది. వీళ్ళవల్ల అన్ని చోట్ల రద్దీ ఏర్పడి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.



ఆక్సీజన్ మించిన విలువ వైన్ సంతరించు కున్నట్లు అనిపించింది. ఇంత సొమ్మే మందుకు ఖర్చు పెట్టగలిగే ఈ ప్రజలకు వాక్సీన్లకు పరిమితమైన ధరలు వసూలు చెయ్యాలి అదీ నిర్మొహమాటంగా! పరిస్థితి చూస్తుంటే ఈ లాక్డౌన్ దాన్ని విధించిన విధానం కోవిడ్ నిబంధనలు పాటించని ఈ జనానికి ఏ మాత్రం ప్రయోజనం కలిగించక పోగా ఈ కోవిడ్ ప్రమాధాన్ని మరీ ఇబ్బడి ముబ్బడి గానే కాదు కొన్ని పదుల రెట్లు పెంచేసింది. 



అలాగే పండ్లు కూరగాయలు నిత్యావసరాలు ఇక దొరకవన్నట్లు అవసరాలకు మించి జనాలు కొనేశారు. ఈ దుకాణాల ముందు టోలీచౌకి రైతుబజారు క్రిక్కిరిసి పోయింది. అంతటా జనం గుంపులుగా చేరి జనసముద్రం తలపించింది. ఈ పరిస్థితి గమనిస్తే కరోనా వ్యాప్తికి క్రమశిక్షణ ఏమాత్రం పాటించని బాధ్యతా రాహిత్యం అన్నీచోట్ల కనిపిస్తుంది. ప్రజలకు ప్రభుత్వాలు నియమ నిబంధనలు విడుదల చేసి అనుసరించని వారిని చట్ట ప్రకారం శిక్షలు విధించాలి. అదీ కఠినంగా అమలు పరచాలి. ఈ మాత్రం అమలు చేయలేని నాయకులు మనకవసరమా?



ఇలాంటి జనాలకు కుల విభజన చేసి రిజర్వేషన్ అమలు చేయటం మహా నేరం. అలాగే పలు విధాల సబ్సిడీలు, అవాంచిత ఆర్ధిక ప్రయోజనాలు కలిపించి రాష్ట్రాన్ని ఆర్ధికంగా నడ్డి విరిచే ఈ పాలకుల తీరు గర్హనీయం. ఏం చేస్తే ప్రజలు ఓట్లేస్తారు? ఓట్లు రాబట్టటం ఎలా? ఇదే ప్రధానం అయినప్పుడు, మహమ్మారులను నిరోధించటం అసంభవం అవుతుంది.

   


హాస్పిటల్ మాఫియా, మెడికల్ మాఫియా – చికిత్స, ఔషధాల విషయంలో రోగులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. నల్లబజార్లలొ ప్రాణాధార మందులను తరలించి పది నుండి ఇరవై రెట్లు ధరలను పెంచేసి దోచేస్తుంటే - హాస్పటళ్ళ మాఫియా వందలు వేలలో చికిత్స అందించగలిగే చోట లక్షల్లో బిల్లులు వేసి తమ దుర్మార్గాలను తారస్థాయికి చేర్చాయి.



పెద్ద పెద్ద హాస్పటళ్లలో ఒక రోగి చికిత్స కోసం చేరితే అవసరమైన అవసరంలేని మందులు దుర్మార్గపు ధరలతో హాస్పిటల్ మాఫియా దోపిడి చేయటం ‘శవాల మీద పేలాలు ఏరుకునే తీరును’ నిరోధించలేని ప్రభుత్వాలు వాటిని నడిపే రాజకీయ పార్టీలు అందులో బాగమైన అధికార యంత్రాంగం ఉండి ఏం ప్రయోజనం?  



ఇంత దోపిడి చేసే హాస్పిటల్ యంత్రాంగం తనకు కావలసిన ఆక్సీజన్ పరిమాణం ముందుగా అంచనా వేయలేక పోవటం దుర్మార్గం కాదా? బెడ్స్, వెంటిలేటర్స్ అవసరాలను సైతం ముందుగా గుర్తించి నిర్వహించలేక పోవటం పరమ నీచం. ఇందులో దోపిడీ నిక్షిప్తమై ఉంది. ప్రజల ప్రాణాలను హరించే మహమ్మరిని నిరోధించాల్సిన వేళ ప్రజలను ఇంకా దోపిడీ చేసే ఈ హాస్పిటళ్ల వెనుక అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల బందువులు, అనుయాయులు ఉన్నారనటంలో ఏ మాత్రం సంశయించనవసరం లేదు.



దయ కరుణ అవసరమైన చోట ఆర్ధిక దోపిడీకి మానసిక హింసను చొప్పించే వ్యవస్థలును నియంత్రించే నిరోధించే నిఘా పెట్టే వ్యవస్థలను స్వయానా ప్రభుత్వం క్షీణింపజేస్తున్న తీరు ఏ మాత్రం క్షమార్హం కాదు. ఒక రోగి మరణిస్తే వారి వద్ద మిగిలిన మందులు మొదలైన వాటిని నల్ల బజార్లకు తరలిస్తున్నారన్నది భరించ తగని విషయం. ఒక రోగి పేరుతో మందులు కొని వాటిని వెరోకరికి వాడి సొమ్ములు కొట్టేసే చిన్న, మద్య తరగతి మరియు కార్పోరేట్ హాస్పిటళ్లను అదుపు చేయలేక పోవటం మన ఖర్మ.



అంతే కాదు రోగుల ఒంటిపై ఉన్న విలువైన ఆభరణాలను మరణించినప్పుడే కాదు బ్రతికున్నప్పుడు కొట్టేసే ఒక కిరాతక వ్యవస్థ హాస్పటళ్ళలో వెళ్ళూనుకొని ఉంది. ఇక మరణించిన రోగుల దేహం నుండి పలు దేహాంగాలను తప్పించి వాటిని అమ్మేస్తున్న సంఘటనలు గుండెల్ని పిండేస్తున్నాయి.  


బాధ్య‌త‌యుతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అంబులెన్స్ సిబ్బంది సైతం న‌డిరోడ్డుపై క‌రోనా మృత‌దేహాన్ని వ‌దిలివెళ్లిన తీరు గుండెలు పిండేస్తుంది. క‌రోనాతో మరణించిన వారిని కోవిడ్ ప్రోటోకాల్ ప్ర‌కారం మృత‌దేహానికి అంత్య‌క్రియ‌లు నిర్వహించాల్సి ఉంటుంది. చాలా సంద‌ర్భాల్లో మున్సిప‌ల్  సిబ్బంది, వైద్య సిబ్బంది మృత‌ దేహాల‌ను స్మ‌శాన‌వాటిక‌కు త‌ర‌లించి అంత్య‌క్రియ‌లు చేస్తుండగా - కొన్ని చోట్ల మాన‌వ‌త్వం మ‌ర‌చి న‌డిరోడ్డు పై మృతదేహాన్ని వ‌ద‌లివేయ‌డం  అంద‌రి హృదయాలని క‌లిచివేసింది. ఈ సంఘటన జరిగిన ఒక చోట స్థానికులతో ఒక పోలీస్ ఉన్నతాధికారి  మాట్లాడుతూ మానవత్వాన్ని మరిచి కరోనా మహమ్మారి ముందు మనం తలవంచడం చాలా  దారుణ‌మ‌ని, క‌రోనా వైర‌స్ బారిన ప‌డినవారి ప‌ట్ల వివక్ష చూపవద్దు అని తెలిపారు.



మరణించిన వారిపట్ల కుల మతాతీతంగా అంత్యక్రియలు గౌరవ ప్రపత్తులతో నిర్వహించే భారతీయ సాంప్రదాయం కోవిడ్ మహమ్మరితో అంతరించి పోతుందనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: