నవంబర్1 నుండి దేశ వ్యాప్తంగా  కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు చేయాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాలు ఇచ్చారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీ లో చేరే ప్రతి సభ్యునికి 2 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వడానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసామ‌ని రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యునికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఇన్సూరెన్స్ కల్పించనుందని ఆయ‌న వెల్ల‌డించారు. సహాయ నిరాకరణ ద్వారా ప్రపంచానికే 1920 లో కాంగ్రెస్ పార్టీ శాంతి సందేశం ఇచ్చింద‌ని రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఉప్పు సత్యాగ్రహం ,క్విట్ ఇండియా ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం తీసుకొచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. 

మొదటి తరం లో మహాత్మా గాంధీ ,రెండో తరం లో దేశ సమగ్రత ను కాపాడడడం కోసం ఇందిరా గాంధీ..మూడో తరంలో రాజీవ్ గాంధీ ప్రాణాలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ రేవంత్ రెడ్డి వారి త్యాగాల‌ను గుర్తు చేశారు. నాలుగో తరం లో గొప్ప నాయకత్వం ఉన్న నాయుకుడు రాహుల్ గాంధీ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. చదువుకునే హక్కును చట్టబద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని రేవంత్ చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి దేశ ప్రజలను కాపాడింది కాంగ్రెస్ పార్టీనే అని ఆయ‌న వెల్ల‌డించారు. యువకుల్లో చైతన్యం తీసుకురావడానికి 18 ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చింది కూడా రాజివ్ గాంధీనే అని తెలిపారు.

ఈ దేశానికి కంప్యూటర్ ను పరిచయం చేసింది కూడా రాజీవ్ గాంధీనే అని రేవంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మొబైల్ లను పరిచయం చేసింది కూడా కాంగ్రెస్...డిజిటల్ మెంబర్షిప్ చేసి పారదర్శకంగా పల్లెల్లో కూడా సభ్యత్వం తీసుకునే అవ‌కాశం వచ్చిందన్నారు. తెలంగాణ లో 30 లక్షల సభ్యత్వాలు నమోదు చేస్తామని మనిక్ ఠాగూర్ తో కలిసి సోనియా గాంధీ కి మాట ఇచ్చిన‌ట్టు రేవంత్ తెలిపారు. డిసెంబర్ 9 న హైదరాబాద్ శివారులో రాహుల్ గాంధీ ని పిలిచి అతి పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తామ‌ని రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. సభ్యత్వం చేసుకున్న వారికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ  పథకాల్లో ముందు స్థానంలో ఉంటారు అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: