రాష్ట్రవ్యాపాతంగా ఇప్పుడు వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం (ఓటీఎస్) గురించే చర్చ నడుస్తోంది. ఈ పథకం ప్రజలకు ఉపయోగకరంగా ఉందని, రుణ విముక్తుల్ని చేస్తుందని ప్రభుత్వం నమ్మకంగా చెబుతోంది. మరోవైపు ప్రతిపక్షం మాత్రం ఇదో బోగస్ పథకం అని, దీని ద్వారా ప్రభుత్వం పేదల డబ్బులు సేకరించాలనే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శిస్తోంది. ఇందులో ఏది నిజం..? ఎంత నిజం..? అనే విషయాల్ని పక్కనపెడితే ఓటీఎస్ తో జగన్ సర్కారు ఇరుకున పడిందనే మాట మాత్రం వాస్తవం అనే చెప్పాలి.

స్వచ్ఛందమే.. కానీ..!
ఓటీఎస్ స్వచ్ఛందం అని అంటున్నారు అధికార పార్టీ నేతలు. మంత్రులు కూడా ఇందులో బలవంతమేనీ లేదు, ఇష్టం ఉన్నవారు మాత్రమే ఓటీఎస్ రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తీసుకోవాలంటున్నారు. మరి అధికారులకి మాత్రం ఇది తలనొప్పిగా మారింది. ఓటీఎస్ విషయంలో టార్గెట్లు ఉన్నమాట వాస్తవమే. సహజంగా ఏ ప్రభుత్వ పథకం అమలు చేయాలన్నా అధికారులు ముందుగా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. అందులో భాగంగానే కిందిస్థాయి సిబ్బందికి టార్గెట్లు పెడతారు. ఓటీఎస్ విషయంలో కూడా ఇదే జరిగింది. దీంతో ప్రతిపక్షాలు ఈ పథకంపై విమర్శలు మొదలు పెట్టాయి. ఓటీఎస్ నిర్బంధం చేస్తున్నారని మండిపడుతున్నాయి. టీడీపీ అనుకూల మీడియాలో కూడా ప్రభుత్వం పేదల్ని ఇబ్బంది పెడుతున్నట్టు వార్తలొస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం పదే పదే ఇది స్వచ్ఛందం అని ప్రకటనలివ్వడం విశేషం.

స్వచ్ఛందంగా ముందుకు రండి, మీ రిజిస్ట్రేషన్ పత్రాలు పొందండి అంటూ ప్రభుత్వం పిలుస్తుంటే ప్రజలెవరూ ఉత్సాహం చూపించడంలేదు. ఉన్నట్టుండి 10వేల రూపాయలు, 15వేల రూపాయలు ఇంటికోసం ఖర్చు పెట్టాలంటే కొంతమంది పేదలు అనాసక్తి చూపిస్తున్నారు. అందులోనూ ఇప్పటికిప్పుడు రుసుము చెల్లించి సర్టిఫికెట్ తీసుకోవడం వల్ల కొత్తగా కలిగే ప్రయోజనం ఏదీ ఉండదనేది ప్రజల భావన. పైగా టీడీపీ నేతలు తాము అధికారంలోకి వస్తే రుసుము లేకుండానే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇస్తున్నారు. ఈ హామీని నమ్మి ప్రజలు ఓట్లు వేసి, 2024లో టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పలేం కానీ.. ప్రతిపక్షం అంత ధీమాగా చెబుతోంది కాబట్టి.. ప్రజల్లో కూడా ఓ ఆలోచన వచ్చింది. చివరకు ప్రభుత్వమే ఈ విషయంలో దిగొస్తుందేమో వేచి చూడాలి. ప్రస్తుతానికయితే ఓటీఎస్ పై జరుగుతున్న చర్చలో ఏపీ ప్రభుత్వం ఇరుకునపడిందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ots