మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గంలో సంక్రాంతి సందర్భంగా క్యాసినో ఏర్పాటు చేశారని, అక్కడికి గోవా కల్చర్ తీసుకొచ్చారని, పోలీసులకు తెలిసి కూడా ఈ వ్యవహారంలో సైలెంట్ గా ఉన్నారని, అన్నిటికీ మంత్రే మూల కారణం అనేది టీడీపీ వర్గాల ప్రధాన ఆరోపణ. అందుకే నిజ నిర్థారణ కమిటీ పేరుతో గుడివాడలో హడావుడి సృష్టించేందుకు టీడీపీ నేతలు బయలుదేరారు. మధ్యలో దాడి అంటో మరో ఎపిసోడ్ మొదలైంది. చివరకు కొడాలి నాని మరోసారి విమర్శలతో విరుచుకుపడటంతో క్యాసినో వ్యవహారం మరింత రసవత్తరంగా మారింది.

క్యాసినో వ్యవహారంలో మంత్రి కొడాలి నాని స్పందనపై.. టీడీపీ సోషల్ మీడియా వింగ్ ఇప్పుడో కొత్త లాజిక్ ని తెరపైకి తెస్తోంది. క్యాసినో తనకు చెందిన స్థలంలో జరగలేదని నాని చెబుతున్నారని, అంటే.. గుడివాడలో ఇంకెక్కడో జరిగిందనేది నిజమని అంటున్నారు టీడీపీ నేతలు. స్వయంగా కొన్ని కార్యక్రమాలను తాను అడ్డుకున్నానని మంత్రి చెబుతున్నారని, అవెక్కడ జరిగాయో ఆయన చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ వ్యవహారంలో సుమోటోగా కేసులు నమోదు చేయాలంటున్నారు. మొత్తమ్మీద గుడివాడలో ఏదో జరిగిందనే విషయాన్ని మాత్రం వారు హైలెట్ చేస్తున్నారు. పోలీసులను కూడా దీనికి బాధ్యులుగా చూపిస్తున్నారు. పోలీస్ డిపార్ట్ మెంట్ లోని కొందరు వ్యక్తుల సహాయ సహకారాల వల్లే ఇలాంటి వ్యవహారాలన్నీ గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నాయనేది టీడీపీ వాదన.

నిజంగానే టీడీపీ లాజిక్ కి మంత్రి కొడాలి దొరికేశారా..? సమాధానం చెప్పలేకే చంద్రబాబు, లోకేష్ పై రివర్స్ అటాక్ మొదలు పెట్టారా..? అనేవి ప్రస్తుతానికి ప్రశ్నలుగానే ఉన్నాయి. సోషల్ మీడియాలో మాత్రం మరోసారి కొడాలి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ముఖ్యంగా నారా లోకేష్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు హైలెట్ అవుతున్నాయి. ఒకరకంగా మంత్రి ఈ వ్యవహారంతో కాస్త చికాకుపడుతున్నారనేది మాత్రం వాస్తవం. ఏకంగా ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్ ని టీడీపీ హైలెట్ చేయడంతో మంత్రి ప్రతిదాడికి దిగారు. వివిధ ఛానెళ్లకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. నిజంగానే టీడీపీ లాజిక్ కి మంత్రి దొరికేశారా..? మంత్రి మాటల్ని బేస్ చేసుకుని గుడివాడలో పండగ పూట ఏదో జరిగిందనేది వాస్తవం అని టీడీపీ చెప్పాలనుకుంటుందా..? త్వరలోనే క్యాసినో వ్యవహారంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.


మరింత సమాచారం తెలుసుకోండి: