రష్యా మొదటి లక్ష్యం తానేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాతి లక్ష్యం తన కుటుంబమని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాము ఉక్రెయిన్ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. రష్యా తక్షణమే ఆక్రమణలు ఆపి.. చర్చలకు రావాలని కోరారు. దాడులు ఆపేంత వరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యా సైన్యం దూకుడుగా ముందుకు సాగుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోకి రష్యా సైన్యం ప్రవేశించింది. కీవ్ నగరంపై ప్రధానంగా గురి పెట్టిన రష్యా.. అనుకున్నట్టే నలువైపుల నుంచి దాడి చేసి నగరంలోకి చేరుకుంది. రష్యా దాడులతో కీవ్ లో ఎయిర్ రెయిడ్ సైరన్లు నిరంతరాయంగా మోగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ కు చెందిన స్నేక్ ద్వీపాన్ని రష్యా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఇక ఉక్రెయిన్ ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. గుండెలు అదిరేలా జరుగుతున్న బాంబు దాడులతో ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బతుకుతున్నారు. బంకర్లు, మెట్రో స్టేషన్లలో స్థానికులు తలదాచుకుంటున్నారు. సేఫ్ షెల్టర్లలో తలదాచుకున్నా..బాంబు శబ్దాలతో ప్రజలు వణికిపోతున్నారు. చిన్నారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఏ క్షణాన ఎటు నుంచి ఏ మిస్సైల్ వచ్చి పడుతుందోనన్న భయం ప్రజలను వేధిస్తోంది.

కీవ్ నగరంపై విరుచుకుపడ్డ రష్యా సేనలు.. ఈ రోజు సమ్మీనగరంపై తమ ప్రతాపం చూపాయి. రష్యా మిస్సైల్ దాడిలో సమ్మీ నగరం అగ్నిగుండంలా మారింది. ఎటు చూసినా ఎగిసిపడుతున్న మంటలే కనిపిస్తున్నాయి. బాంబు దాడులతో సమ్మీ నగరం నామరూపాల్లేకుండా పోయింది. ఆటోమెటిక్ గన్స్, బాంబుల శబ్దమే వినిపిస్తోంది. అటు జనావాసాలపై కూడా రష్యా ప్రయోగించిన మిస్సైల్స్ పడటంతో భారీ విధ్వంసం జరిగింది. మొత్తానికి ఉక్రెయిన్ లో భయానక వాతావరణం కనిపిస్తోంది. రష్యా బాంబు దాడుల కారణంగా ప్రజలు గజగజ వణికిపోతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: