వంగవీటి రాధా. కాపు వర్గంలో మంచి పట్టున్న నేత. వంగవీటి రంగా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చినా ప్రస్తుతం ఆయన యాక్టివ్ గా లేరు. టీడీపీలో ఉన్నా లేనట్టే. అదే సమయంలో ఆయనకు వైసీపీ నేత కొడాలి నానితో మంచి సంబంధాలున్నాయి. ఇటు జనసేన నాయకులతో కూడా సత్సంబంధాలు మెయింటెన్ చేస్తున్నారు. అయితే సడన్ గా రాధా.. జనసేనలో చేరబోతున్నారనే వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో కూడా ఓసారి రాధా జనసేనలో చేరతారని అనుకున్నా అది సాధ్యం కాలేదు. మళ్లీ ఇప్పుడు ఆ వార్తలకు బలం చేకూరే సంఘటన ఒకటి జరిగింది. వంగవీటి రాధా, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్.. ఇద్దరి కలయికే దీనికి ఊతం ఇస్తోంది.

వంగవీటి రాధాకృష్ణ, నాదెండ్ల మనోహర్ కలిసి విజయవాడలో టీ తాగుతూ కనిపించడం, మీడియాలో ప్రముఖంగా రావడంతో అందరూ ఏదో జరుగుతోందని అనుమానించారు. రాజకీయ ఊహాగానాలు ఎక్కువయ్యాయి. అయితే అసలు సంగతి ఇదంటూ రాధా స్టేట్ మెంట్ ఇచ్చారు. జనసేన నాయకులు ఆదివారం జనవాణి అనే కార్యక్రమం పెడుతున్నారు. అది విజయవాడలో మొదలవుతుంది. వంగవీటి రాధా ఆఫీస్ పక్కనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించే వేదిక ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఆ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి వచ్చిన మనోహర్ పక్కనే ఉన్న రాధా ఆఫీస్ కి వెళ్లారు. అక్కడ కాసేపు టీ తాగుతూ మాట్లాడుకున్నారు.

వీరిద్దరూ టీ తాగుతూ కలసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వంగవీటి రాధా జనసేనలో చేరబోతున్నారంటూ పుకార్లు మొదలయ్యాయి. కాసేపటికే ఈ వార్త వైరల్ కావడంతో విజయవాడ రాజకీయాల్లో పెద్ద చర్చ నడిచింది. రాధా ఎప్పుడు జనసేనలో చేరుతున్నారు, ఆయన ఎక్కడనుంచి పోటీ చేస్తారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అది కేవలం చాయ్ పే చర్చ మాత్రమేనని దాటవేశారు నాదెండ్ల మనోహర్. కరెంట్ అఫైర్స్ మాట్లాడుకోలేదని, కరెంటు చార్జీల గురించి మాత్రమే మాట్లాడుకున్నామని చెప్పారాయన. అటు వంగవీటి రాధాకృష్ణ కూడా కేవలం టీ కోసమే కలిశామని, రాజకీయాల ప్రస్తావన లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే రాధా జనసేన ఎంట్రీ అనే పుకార్లు మాత్రం ఆగలేదు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా రాధా జనసేనలో చేరతారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: