వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చివరకు నిలువ నీడేలేకుండా పోతుందేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డితో వైరం కారణంగా వైసీపీలో ఎవరితోను పడటంలేదు. ఏపీలోకి అడుగుపెడితే ఏమవుతుందో బాగా తెలుసు కాబట్టే చాలాకాలంగా ఏపీలోకి అడుగుపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. అందుకనే అవసరమైతే హైదరాబాద్ కు లేకపోతే పూర్తికాలం ఢిల్లీలోనే కాలం గడిపేస్తున్నారు. తాజా పరిణామాల్లో ఇకమీదట హైదరాబాద్ కు వచ్చేది కూడా అనుమానంగానే తయారైంది.
ఇంతకీ విషయం ఏమిటంటే టీఆర్ఎస్ లోని నలుగురు ఎంఎల్ఏల కొనుగోలు వ్యవహారంలో రఘురాజు హస్తంకూడా ఉందని సిట్ అనుమానిస్తోంది. ఈనెల 29వ తేదీన విచారణకు రావాలని సిట్ ఎంపీని ఆదేశించింది. తనకెలాంటి సంబంధంలేదని ఎంపీ చెబుతున్నా ఏదో ఆధారం లేకుండా విచారణకు రమ్మని సిట్ ఎంపీకి నోటీసిస్తుందా అనేది కీలకమైన ప్రశ్న. విచారణలో గనుక ఎంపీ పాత్రుందని తేలితే అంతే సంగతులు. తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించే వాళ్ళని ఎవరినీ వదిలిపెట్టకూడదని కేసీయార్ మహా పట్టుదలతో ఉన్నారు.
తన ప్రభుత్వం కూల్చివేత కుట్రలో రఘురాజు పాత్రుందని తేలితే కేసీయార్ ఊరకుంటారా ? ఈ కారణంగా హైదరాబాద్ లో కూడా కాలుపెట్టే అవకాశాన్ని ఎంపీ కోల్పోతారేమో. ఇటు ఏపీలోను అడుగుపెట్టలేక అటు హైదరాబాద్ లోను కాలుపెట్టలేకపోతే రఘురాజు ఏమైపోవాలి ? మిగిలింది ఇక ఢిల్లీ మాత్రమే. అయితే ఎంఎల్ఏల కొనుగోళ్ళ వ్యవహారంలో ఆధారాలతో సహా ఎంపీ పాత్ర బయటపడితే బీజేపీ ఎందుకు దగ్గరకు రానిస్తుంది ?
ఇంతకాలం బీజేపీ అండచూసుకునే ఎంపీ రెచ్చిపోతున్నారు. అలాంటిది ఎంఎల్ఏల కొనుగోళ్ళ వ్యవహారంలో తన నేతలను రక్షించుకునేందుకే బీజేపీ నానా అవస్తలు పడుతోంది. కొనుగోళ్ళ వ్యవహారంలో తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్న జాతీయ ప్రధానకార్యదర్శి బీఎల్ సంతోష్ ను ఎలా బయటపడేయాలో బీజేపీ అగ్రనేతలకు అర్ధంకావటంలేదు. ఈ పరిస్ధితుల్లో రఘురాజును పట్టించుకునే అవకాశం తక్కువే. ఎందుకంటే అనైతిక రాజకీయాలు చేస్తున్న వాళ్ళని కాపాడుతోందనే ముద్రనుండి బయటపడటమే బీజేపీ ముందున్న ప్రధాన టార్గెట్. ఈ పరిస్ధితుల్లో రఘురాజు ఏమైపోతారో చూడాల్సిందే.