ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ వైకాపాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే తూర్పు నియోజక వర్గంలో పలువురు వైకాపా నాయకులు తెదేపాలోకి వలస పోగా తాజాగా విజయవాడ తూర్పు నియోజక వర్గానికి చెందిన సీనియర్‌ వైకాపా నేత అయినటువంటి ఎంవీఆర్‌ చౌదరి విజయవాడ పార్లమెంట్‌ తెదేపా అభ్యర్థి కేశినేని శివనాథ్‌ (చిన్ని) సహకారంతో సోమవారం ఉండవల్లిలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సమక్షాన తన అనుచరులతో కలిసి తెదేపా తీర్థం పుచ్చుకోవడం జరిగింది. గతంలో ఆయన తూర్పు నియోజకవర్గ సమన్వయ కర్తగా కొంతకాలం పని చేసిన సంగతి అందరికీ తెలిసినదే.

ఈ కార్యక్రమంలో లోకేశ్‌ కండువా కప్పి ఆయన్ని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేయాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఆ తరువాత ఎంవీఆర్‌ చౌదరి మాట్లాడుతూ... విజయవాడలో తెదేపా అభ్యర్థుల గెలుపు కోసం తను మనసా, వాచా, కర్మణా కృషి చేస్తానని మాటివ్వడం జరిగింది. ఇకపోతే విజయవాడ తూర్పు నియోజక వర్గంలో ఎంవీఆర్ చౌదరికి మంచి పేరు ఉంది. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ రావు టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు.

ఇదే విషయమై లోకేష్ తాజాగా ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెడుతూ... "విజయవాడకు చెందిన వైసీపీ నేత మండవ వెంకట్రామ్ చౌదరి (ఎంవీఆర్ చౌదరి) తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఎంవీఆర్ చౌదరితో పాటు విజయవాడ తూర్పు, పెనమలూరు నియోజక వర్గానికి చెందిన దాదాపు 50 మంది ముఖ్యమైన కార్యకర్తలు మా పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాను." అని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను సైతం ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: