
హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో నాడు ఐటీ రంగానికి పునాదులు వేశానని, ఎన్నో అంతర్జాతీయ కంపెనీలను నగరానికి తీసుకొచ్చానని చంద్రబాబు గుర్తు చేశారు. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందంటే ఈ ఘనత తనకు, టీడీపీకే చెందుతుందన్నారు. అలాగే రాజకీయ లబ్దీ కోసం పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుతో పాటు ఇతర అంశాలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని బాబు మండిపడ్డారు.
అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీశ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. గోబెల్స్ కూడా సిగ్గుపడేలా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని.. అసలు ఆంధ్ర మహానాడులో తెలంగాణ ముచ్చట్లెందుకు అంటూ జగదీశ్ రెడ్డి నిలదీశారు. తెలంగాణలో చంద్రబాబు చరిత్ర 2004తోనే ముగిసిందని.. కానీ ఆయన తానే హైదరాబాద్ మొత్తాన్ని అభివృద్ధి చేశానని తరచూ చెప్పుకోవడం నవ్వొస్తోందని జగదీశ్ రెడ్డి చురకలు వేశారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ తలసరి ఆదాయం 1.12 లక్షలు ఉండగా.. కేసీఆర్ పాలనలో అది 3.70 లక్షలకు చేరుకుందని.. కానీ ఏపీ తలసరి ఆదాయం ఇప్పటికీ 2.50 లక్షలు మాత్రమే అని ఆయన అన్నారు. గొప్ప నాయకుడిని అని చెప్పుకునే మీరు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ఐదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా తలసరి ఆదాయాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేక పోయారు? అంటూ జగదీశ్ రెడ్డి చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుతం జగదీశ్ రెడ్డి వ్యాఖ్యల వైరల్ గా మారడంతో.. బాబు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.