
ఇంతకీ అసలు విషయమేమిటంటే, ఆధార్ కార్డులో చిరునామా మార్చుకోవడం అతి సులువు. ఈ ఒక్క బలహీనతను ఆసరాగా చేసుకుని, కేవలం ఎన్నికల సమయంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చిరునామా మార్చేసి, దొంగ ఓట్లు వేయించే భారీ దందాకు తెరలేపినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉదాహరణకు, తెలంగాణలో ఉన్న వ్యక్తి, బీహార్ ఎన్నికల కోసం తాత్కాలికంగా అక్కడి చిరునామాతో ఆధార్ అప్‌డేట్ చేయించుకుని, ఓటు హక్కు పొంది, ఎన్నికలు ముగిశాక మళ్లీ పాత అడ్రస్‌కు మారిపోవచ్చు. ఈ డిజిటల్ లూప్‌హోల్‌తో ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ వ్యవహారం కేవలం చిరునామా మార్పుకే పరిమితం కాలేదు. దేశంలోకి అక్రమంగా చొరబడిన వారికి, శరణార్థులకు సైతం ఆధార్ కార్డులు అక్రమ మార్గాల్లో జారీ అయ్యాయన్నది మరో తీవ్రమైన ఆరోపణ. భారత పౌరులకు మాత్రమే జారీ కావాల్సిన ఆధార్, దేశ భద్రతకు సవాల్ విసురుతున్న శక్తుల చేతికి చిక్కింది. బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో జనాభా కంటే ఆధార్ కార్డుల సంఖ్య 120 శాతానికి పైగా ఉందంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అవినీతి అధికారులు, కొన్ని స్వార్థ శక్తుల అండతో ఈ అక్రమ దందా యథేచ్ఛగా సాగిపోయిందని తెలుస్తోంది.
ఇలాంటి అక్రమ ఓట్లతో ఎన్నికల ఫలితాలనే తారుమారు చేసే కుట్రలకు అడ్డుకట్ట వేసేందుకే ఎన్నికల సంఘం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ను కేవలం గుర్తింపు కార్డుగా మాత్రమే పరిగణించాలని, నివాస ధ్రువీకరణకు ఇతర పత్రాలను తప్పనిసరి చేయాలని స్పష్టం చేసింది. అయితే, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడే ఈ ప్రయత్నానికి సైతం రాజకీయ రంగు పులుముకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు గళం విప్పడం, ఈ అంశాన్ని మరింత సంక్లిష్టంగా మార్చింది.