
- ఎన్టీఆర్ దగ్గర నుంచి వైఎస్ జగన్ వరకు అందరూ బడుగులను మోసం చేసిన వారే
- వచ్చే ఎన్నికల్లో ఈ రెండు సామాజిక వర్గాల నుంచి ఒక్కరు కూడా చట్ట సభల్లో అడుగు పెట్టకూడదు
- అన్ని సామాజిక వర్గాలను ఏకం చేసి బడుగులను రాజ్యాధికారం వైపు నడిపించే బాధ్యత బిసివై పార్టీది
- త్వరలో బిసివై భరోసా యాత్ర ద్వారా సామాజిక వర్గాల ఏకీకరణ
- బిసివై పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పార్టీ అధినేత రామచంద్రయాదవ్ రణనినాదం
రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలను రాజకీయాల నుంచి బహిష్కరించాలని బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం విజయవాడలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో భారత చైతన్య యువజన పార్టీ రెండవ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలే అధికారాన్ని అనుభవిస్తున్నాయన్నారు. ఆ రెండు సామాజిక వర్గాలను రాజకీయంగా బహిషర్కరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ రెండు సామాజిక వర్గాలు మినహా మిగిలిన అన్ని సమాజిక వర్గాలను ఏకం చేసే బాధ్యత బిసివై పార్టీ తీసుకుంటుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బహుజనులను రాజ్యాధికారం దిశగా పార్టీ అడుగులు వేయబోతోందన్నారు. బిసివై భరోసా యాత్ర పేరుతో బహజన చైతన్యం, యువజన పోరాటానికి నాంది పలకబోతున్నామన్నారు.
మనకు కిలో 2 రూపాయల బియ్యం.. వాళ్లకేమో లక్షల కోట్ల భూములు
తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు బడుగు, బలహీన వర్గాలకు కిలో బియ్యం రెండు రూపాయలకు ఇచ్చి, లక్షల కోట్ల విలువైన భూములు ఆయన సామాజిక వర్గానికి కట్టబెట్టుకున్నారని రామచంద్రయాదవ్ ఆగ్రహ వ్యక్తం చేశారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఆయన అధికారంలోకి రావడానికి కారణం ఆయన సినీ చరిష్మానో లేక, తెలుగువారి ఆత్మ గౌరవ నినాదమో కాదన్నారు. బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి చేస్తామని మాట ఇవ్వడం వల్ల ఆయన అధికారంలోకి వచ్చారన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక బడుగులకు కిలో బియ్యం ఇచ్చి హైదరాబాద్ నడిబొడ్డులో లక్షల కోట్ల విలువైన భూములను తన సామాజిక వర్గం వారికి కట్టబెట్టారన్నారు. రామానాయుడు, రాఘవేంద్రరావులతో పాటు ఆయన్ని రాజకీయంగా వ్యతిరేకించినా కూడా హీరో కృష్ణ తన సామాజిక వర్గానికి చెందిన వాడనే కారణం చేత ఆయనకు కూడా భూములు కట్టబెట్టారన్నారు. కానీ దాసరినారాయణరావు లాంటి సినీ ఉద్దండులకు ఒక్క సెంటు కూడా భూమి ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. అందుకు కారణం దాసరి నారాయణరావు తమ సామాజిక వర్గం కాకపోవడమేనన్నారు. కానీ బడుగు బలహీన వర్గాల్లో ఒక్కరికీ న్యాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు, వైఎస్సార్ ఇద్దరూ దోచి పెట్టారు
ఎన్టీఆర్ తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూడా అదే పంధాను కొనసాగించారని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సామాజిక వర్గానికి చెందిన వారినే ఎక్కువగా ప్రోత్సహించారన్నారు. భూములు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా తమ రెడ్డి సామాజిక వర్గానికి సహజ వనరుల దగ్గర నుంచి కాంట్రాక్టుల వరకు దోచిపెట్టారన్నారు. వీరి హయాంలో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలే అభివృద్ధి చెందాయి తప్ప బడుగులకు ఆకలి కూడా తీరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ అరాచకాలకు బడుగు, బలహీన వర్గాలు బలి
2019లో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి వికృత రాజకీయాలతో రాష్ట్రం అల్లాడిపోయిందని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజ సంపదను, భూములను, కాంట్రాక్టులను తన సామాజిక వర్గానికి దోచి పెట్టారన్నారు. బడుగు, బలహీన వర్గాలు జగన్ రాజకీయ వికృత క్రీడలో బలై పోయారన్నారు. పేదలకు సంక్షేమం పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మురళీధరన్ కమిషన్ సిఫార్సుల బుట్టదాఖలతోనే బయటపడ్డ టిడిపి నిజస్వరూపం
బడుగు, బలహీన వర్గాలకు ఏదో చేస్తామంటూ ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ... అధికారంలో ఉండగా ఏర్పాటు చేసిన మురళీధరన్ కమిషన్ సిఫార్సులను ఎందుకు అమలు చేయలేదని రామచంద్రయాదవ్ ప్రశ్నించారు. బిసిలకు 1984లోనే 44 శాతం రిజర్వేషన్ లు ఇవ్వాలని కమిషన్ ఆదేశించినా ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్మ, రెడ్డి సామాజికవర్గాలను రాజకీయంగా బహిష్కరించాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు
స్థానిక ఎన్నికల్లో ఒక్కరు కూడా రెడ్డి,కమ్మ సామాజికవర్గాల నుంచి గెలవకూడదు
వచ్చే స్థానిక ఎన్నికల్లో ఒక్కరు కూడా కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల నుంచి గెలవకుండా చూడాల్సిన బాధ్యత మిగిలిన సామాజిక వర్గాలదేనని రామచంద్రయాదవ్ పిలుపునిచ్చారు. అలాగే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన వారిని చట్టసభల్లో అడుగు పెట్టకుండా చూడాలన్నారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం సాధించాలంటే అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు.
సామాజిక వర్గ ఏకీకరణకు బిసివై భరోసా యాత్ర
రెండు తెలుగు రాష్ట్రాల్లో బహుజనులకు రాజ్యాధికారం దిశగా బిసివై పార్టీ అడుగులు వేయబోతోందని రామచంద్రయాదవ్ ప్రకటించారు. త్వరలో బిసివై భరోసా యాత్ర ద్వారా ఆ రెండు సామాజిక వర్గాలు మినహా మిగిలిన సామాజిక వర్గాలను ఏకం చేసే బాధ్యతను బిసివై పార్టీ తీసుకుంటుందన్నారు. భరోసా యాత్ర ద్వారా బడుగు, బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యం నింపి యువతను పోరాటం వైపు నడిచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ సందర్భంగా రామచంద్రయాదవ్ తెలిపారు.