
మహేష్ ఏలూరు లోక్‌సభ నియోజకవర్గంలో కొత్త అభివృద్ధి పనులు ప్రారంభించడమే కాకుండా, మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్టులను మళ్లీ లైన్‌లో పెట్టారు. పార్లమెంట్‌లో తరచూ ప్రశ్నలు వేసి, ఏలూరుకు నిధులు తెప్పించడంలో ఆయన విజయవంతమయ్యారు. ఫలితంగా పలు ప్రాజెక్టులు వేగంగా ముందుకు కదులుతున్నాయి. యువ నేతగా అందరినీ కలుపుకొని పోవడం, ప్రజల మధ్య చురుగ్గా తిరగడం, కేంద్రంలో ప్రెషర్ పెంచి ఫలితాలు సాధించడం - ఇవన్నీ మహేష్ ఇమేజ్‌ను మరింత బలపరిచాయి. చంద్రబాబుకి కూడా ఈ దూకుడు నచ్చి సంతోషం వ్యక్తం చేస్తున్నారని పార్టీ వర్గాల టాక్. ఇక సుధాకర్ యాదవ్ విషయానికి వస్తే, మైదుకూరు లోకల్ లెవెల్లో గానీ, రాష్ట్ర స్థాయిలో గానీ ఆయన పేరు పెద్దగా వినిపించడం లేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ప్రజలతో అనుసంధానం తక్కువగా ఉండడం, అభివృద్ధి కార్యక్రమాలపై సైలెంట్‌గా ఉండటం, మీడియా లైమ్‌లైట్‌లో కనిపించకపోవడం వల్ల ఆయన గ్రాఫ్ కిందికి జారిందన్న అభిప్రాయం ఉంది.
వ్యక్తిగతంగా అందరినీ కలుపుకొని వెళ్లే లౌక్య స్వభావం ఉన్నా, ప్రజల మధ్య చురుకుదనం లేకపోవడం పెద్ద మైనస్‌గా మారిందని పరిశీలకుల అభిప్రాయం. వయసు కారణంగా సుధాకర్‌కి ఫిజికల్‌గా కొన్ని పరిమితులు ఉన్నా, రాజకీయాల్లో అది అడ్డంకిగా మారకూడదని కొందరు అంటున్నారు. ఎందుకంటే, అదే వయసులో దూకుడు చూపిన నేతల ఉదాహరణలు చాలా ఉన్నాయి. కానీ, ఇప్పటివరకు సుధాకర్ ఆ స్థాయిలో ఫైటింగ్ మూడ్‌లోకి రాకపోవడం, మహేష్ అయితే వేగంగా ఎదగడం - టీడీపీ వర్గాల్లో “ఇక పుట్టా ఫ్యామిలీలో అసలు వారసుడు ఎవరో క్లియర్ అయిపోయింది” అన్న చర్చకు కారణమైంది. ఏలూరులో మహేష్ పేరు, పనితీరు హైలైట్ అవుతుంటే… మైదుకూరులో సుధాకర్ పేరు క్రమంగా మాయమవుతుండటం, భవిష్యత్తులో టీడీపీలో ఈ జంట రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయో చూడాలి.