
ఇక అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు రోజురోజుకు బయటపడుతున్నాయి. ఇటీవల రాఖీ పౌర్ణమి సందర్భంగా "రాఖీ కడతా అన్నా" అని కవిత పంపిన సందేశానికి "నేను అందుబాటులో లేను" అని కేటీఆర్ సమాధానం ఇచ్చిన విషయమే దీనికి నిదర్శనం. ఇద్దరి మధ్య సంభాషణలు కూడా తగ్గిపోవడం, రాజకీయ వ్యూహాలలో పరస్పర విమర్శలు చేయడం గమనార్హం. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్న ఎర్రవల్లి ఫార్మ్ హౌస్‌కు కవిత తన కుటుంబంతో కలిసి వెళ్లారు. తన చిన్న కుమారుడు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్తుండటంతో అతడికి తాతగారి ఆశీర్వాదం అవసరమని భావించి కవిత కుటుంబ సమేతంగా కేసీఆర్‌ను కలిశారు. ఇదే సమయంలో కేటీఆర్ కూడా పార్టీ వ్యూహాలపై చర్చించేందుకు ఎర్రవల్లికి చేరుకున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నివేదిక, అసెంబ్లీలో జరగబోయే చర్చ, స్థానిక సంస్థల ఎన్నికలు, ఖైరతాబాద్ ఉపఎన్నిక వంటి కీలక అంశాలపై ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది.
మొత్తానికి వేర్వేరు కారణాల వల్ల కవిత, కేటీఆర్ ఒకే సమయంలో ఫార్మ్ హౌస్‌లో ఉండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. అన్నాచెల్లెళ్లు ఎదురుపడినా పరస్పర ఆప్యాయతలు పంచుకున్నారా లేదా అన్నది స్పష్టంగా బయటకు రాలేదు. అయితే ఇరువురి మధ్య ఇటీవల ఏర్పడిన విభేదాల దృష్ట్యా "హాయ్-బాయ్" స్థాయిలోనే వ్యవహరించి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాక కవిత తన కుటుంబ విషయాలకే పరిమితం కాగా, కేటీఆర్ తన రాజకీయ అజెండాతోనే బిజీగా ఉండటంతో ఇద్దరి మధ్య లోతైన చర్చ జరిగే అవకాశమే లేదని భావిస్తున్నారు. ఈ సంఘటనతో మరోసారి బీఆర్ఎస్‌లో వారసత్వ పోరుపైనే చర్చ మళ్లింది.