
ఎవరెంత చెప్పినా ఆయన శ్రద్ధగా విని, అవసరమైతే తక్షణమే చర్యలు తీసుకోవడం ఆయన ప్రత్యేకత. “అందరివాడు” అనే బిరుదు కూడా ఆయనకే సరిపోతుందని సీనియర్ నాయకులు అంటున్నారు. ముఖ్యంగా స్థానిక సమస్యల విషయంలో ఆయనే స్వయంగా ముందుకు వచ్చి పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు స్థానిక ఎమ్మెల్యేలతో ఫోన్‌లో మాట్లాడి, కేంద్ర స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలను రికార్డు చేసుకుని వాటిపై నిబద్ధతతో అధ్యయనం చేస్తున్నారు. కాకినాడకు ఏది అవసరమో గుర్తించేందుకు కలెక్టర్‌తో కూడా సమన్వయం చేసుకోవడం, వాటిని పార్లమెంటులో ప్రస్తావించడం ఆయనకు మంచి మార్కులు తెచ్చిపెడుతోంది. ఇలా స్థానిక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయడంతో ప్రతిపక్ష వైసీపీ నాయకులకే ఆయనపై విమర్శలు చేసే అవకాశం దొరకడం లేదు.
ఇదే ఆయన నిజమైన బలం. ఇకపై తంగెళ్ల ఒకవైపు స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూనే, మరోవైపు అందరినీ కలుపుకొని పోయే విధానాన్ని అవలంబిస్తున్నారు. ఈ తీరుతో ఆయనకు నియోజకవర్గంలోనూ, కూటమిలోనూ మంచి ఇమేజ్ ఏర్పడింది. ఇతర ఫస్ట్ టైమ్ ఎంపీలు అహంకారంతో విమర్శలకు గురవుతున్న తరుణంలో, తంగెళ్ల వినయ విధేయతతో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకోవడం గమనార్హం. మొత్తానికి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తన వినయం, విధేయతతో పాటు, సమస్యలపై పట్టుదలతో కాకినాడలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారని చెప్పవచ్చు.