ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు రోజురోజుకు గ‌డ్డు ప‌రిస్థితులే ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేల‌పై ఒత్తిడి కేవలం ప్రజల నుండి మాత్రమే కాదు, అధికారుల నిర్ణయాల వల్ల‌ కూడా ఎక్కువవుతోంది. ఒకవైపు ప్రజల అంచనాలు పెరిగిపోతుంటే, మరోవైపు అధికారుల వ్యవహారశైలి ఎమ్మెల్యేల మెడకు చుట్టుకుపోతుంది. ముఖ్యంగా మూడు అంశాలు కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు, నిధుల విడుదల ఎమ్మెల్యేల‌కు పెద్ద తలనొప్పిగా మారాయి.
ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా, ఇప్పటివరకు ఒక్క కొత్త పింఛనూ మంజూరు కాలేదు. కానీ అర్హులైన వారు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు వంటి వారు తాము అర్హులమని చెబుతూ ఎమ్మెల్యేల ఇళ్లకు, కార్యాలయాలకు వస్తున్నారు. ఎమ్మెల్యేలు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, వారు "ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవు" అంటూ నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ప్రజలు కోపాన్ని ఎమ్మెల్యేలపైనే చూపుతున్నారు. తమకు సాయం చేయలేకపోతున్నందుకు నేతలు ఇబ్బందులు పడుతున్నారు.


ఇక రేషన్ కార్డుల సమస్య మరింత క్లిష్టంగా ఉంది. కొత్త కార్డులు ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నప్పటికీ, ప్రజలు మాత్రం తమ సమస్యను ఎమ్మెల్యేల వద్ద పెట్టుతున్నారు. వందల సంఖ్యలో దరఖాస్తులు వారి వద్ద పేరుకుపోతున్నాయి. ఒకప్పుడు నాయకుల మాటకే అధికారులు పనిచేసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అధికారులు “మా చేతిలో లేదు” అని తప్పించుకోవడం మొదలుపెట్టారు. దీని వలన ఎమ్మెల్యేల విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతోంది. అభివృద్ధి పనుల విషయంలోనూ ఎమ్మెల్యేలు నిరుత్సాహకర పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వంలోనూ ఇదే పరిస్థితి. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు అభివృద్ధి పనులన్నీ కలెక్టర్లకు అప్పగించారు. కలెక్టర్ అనుమతిస్తేనే పనులు మొదలవుతున్నాయి. పైగా కలెక్టర్లు తమ అంచనాల ప్రకారం పనులు చేపడుతున్నారు. ఎమ్మెల్యేలు కోరిన పనులు “ఇప్పుడు అవసరం లేదు” అంటూ పక్కన పెట్టేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో అభివృద్ధి కష్టంగా మారింది.


మొత్తం మీద, ప్రజలు తమ సమస్యలు ఎమ్మెల్యేలు పరిష్కరించాలని ఒత్తిడి పెంచుతుంటే, అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు వారిని చేతులెత్తే పరిస్థితికి తెచ్చేస్తున్నాయి. ఒకప్పుడు ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపగలిగే స్థాయి ఉండేది. ఇప్పుడు మాత్రం అధికారుల ఆధీనంలో ఉండిపోవడం వల్ల‌ వారిలో ఆత్మవిశ్వాసం తగ్గుతోంది. ఈ పరిస్థితి మారకపోతే, భవిష్యత్తులో ఎమ్మెల్యేల రాజకీయ స్థిరత్వం సవాలుగా మారడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: