వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం పులివెందులపై టీడీపీ కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఇటీవల జరిగిన నియోజ‌క‌వ‌ర్గ కేంద్రం పులివెందుల‌తో పాటు రాజంపేట నియోజ‌క‌వ‌ర్గంలోని ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించగా, వైసీపీ అభ్యర్థులు డిపాజిట్ కూడా కోల్పోయారు. ఈ పరిణామం వైసీపీకి పెద్ద దెబ్బగా మారింది. ఇంకా ఆ ప్రభావం నుంచి కోలుకోకముందే, టీడీపీ పులివెందులపై మ‌రింత‌ దృష్టి సారించింది. వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరగనున్నాయి. సాధారణంగా వీటిని వాయిదా వేసే అవకాశం ఉన్నా, ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రభావంతోనే సమయానికి నిర్వహించాలనే యోచనలో ఉంది.


మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సదుపాయం, వృద్ధాప్య, వికలాంగ పింఛన్ల పెంపు, ఇతర సంక్షేమ పథకాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ బలాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా లేకుండా జరిగేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో టీడీపీ, ముఖ్యంగా తన బలహీన ప్రాంతాల్లో పట్టు సాధించాలని సంకల్పించింది. గత మున్సిపల్ ఎన్నికల్లో తమ జెండా ఎగరనివ్వని ప్రదేశాల్లో ఇప్పుడు గెలిచి ఆధిపత్యం చూపాలన్న లక్ష్యంతో చంద్రబాబు వ్యూహాలు రూపొందిస్తున్నారు. పుంగనూరు, పులివెందుల, గుడివాడ, గన్నవరం, మచిలీపట్నం, అనకాపల్లి వంటి కీలక ప్రాంతాల్లో టీడీపీ యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేకంగా పులివెందుల మున్సిపాలిటీపై టీడీపీ దృష్టి మరింతగా కేంద్రీకరించింది.


జడ్పీ ఉప ఎన్నికల్లో విజయాన్ని సాధించిన దెబ్బతో ఆ బలం నిలుపుకోవడం, వైసీపీని ఇరుకున పెట్టడం, జగన్ ఇమేజ్‌కి దెబ్బతీయడం ప్రధాన ఉద్దేశ్యంగా మారింది. ఈ క్రమంలో నేరుగా మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగారని సమాచారం. స్థానిక నేతలకు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చి, పార్టీ బలాన్ని పెంచే విధంగా పలు కార్యాచరణలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ ఈ విధంగా పులివెందులపై దృష్టి పెట్టడం, జగన్‌కు గట్టి సవాలుగా మారనుంది. సొంత నియోజకవర్గంలోనే వైసీపీకి ఎదురు దెబ్బలు తగలడం, పార్టీ కేడర్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక ఈ పరిణామాల్లో జగన్ ఎంతవరకు అలెర్ట్ అవుతారు, ఎలా ఎదుర్కొంటారు అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: