
నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు పెద్ద ఎత్తున చికెన్ బిర్యానీ వండించి ప్రజలకు భోజనాలు పెట్టారు. కానీ సమస్య ఆయన ఎంచుకున్న ప్లేస్ మైనస్. జగన్మోహన్ రావు ఈ కార్యక్రమాన్ని వినాయక మండపం ప్రాంగణంలో నిర్వహించారు. అక్కడే బిర్యానీ వడ్డించడం పోలీసులకు అభ్యంతరంగా అనిపించింది. “ఇది గణేశ్ మండపం… ఇక్కడ మాంసాహారం వడ్డించరాదు” అని ఆపేందుకు ప్రయత్నించగా, “మేము ఈ మండపం ఏర్పాటు చేయలేదు” అంటూ గొడవ జరిగింది. ఈ ఘటన ఒక్కసారిగా జాతీయ మీడియా దృష్టికి వెళ్లింది. “వైసీపీ హిందూ వ్యతిరేక చర్యలు” అంటూ నేషనల్ మీడియాలోనూ వార్తలు వచ్చాయి. వెంటనే బీజేపీ నేతలు కూడా వైసీపీపై తీవ్ర స్థాయిలో దాడి ప్రారంభించారు.
ఆలయాలపై దాడులు, హిందూ ఆరాధన స్థలాలపై జరిగిన వివాదాస్పద ఘటనలను గుర్తు చేస్తూ, వైసీపీపై ఎలా నమ్మకం ఉంచగలమని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి వర్మ నుంచి అధ్యక్షుడు మాధవ్ వరకూ పలువురు నేతలు ఒకే రకమైన ట్వీట్లు చేస్తూ జగన్ పార్టీని కార్నర్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రతిఒక్కరు ఈ అంశాన్ని రాజకీయంగా వినియోగించుకుంటున్నారు. “హిందూ భావాలను కించపరిచే పార్టీ” అని వైసీపీపై ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో జగన్ పార్టీ ఇమేజ్ మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. చిన్న పొరపాటుతోనే జాతీయ స్థాయిలో పెద్ద వివాదం ముసురుకోవడం వైసీపీ నేతలకు మరోసారి బిగ్ లెసన్ అయింది.