
ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మైలవరం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిస్థితి కూడా తేడా లేకుండా ఉంది. ఆయన కూడా గత ఎన్నికల్లో పార్టీ కోసం టికెట్‌ను వదిలి, వసంత కృష్ణ ప్రసాద్‌కు అవకాశం కల్పించారు. వసంత విజయం సాధించిన తర్వాత, దేవినేని ఉమాను పార్టీలో పట్టించుకునే వారే లేకుండా పోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పదవి ఇస్తామని హామీ ఉన్నా, ఇప్పటివరకు ఆయనకు ఎలాంటి గుర్తింపు ఇవ్వకపోవడం ఆయన అనుచరుల్లో అసంతృప్తిని పెంచింది.
గుంటూరు జిల్లా పెదకూరపాడు నాయకుడు కొమ్మలపాటి శ్రీధర్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. 2009, 2014 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన ఆయన, 2019లో భాష్యం ప్రవీణ్ కోసం టికెట్‌ను త్యాగం చేశారు. పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటివరకు ఆ హామీ నెరవేరలేదు. వీరు తమ బాధను ఎవ్వరికి చెప్పలేక లోలోన కుమిలిపోతోన్న పరిస్థితి. ఇలాంటి వివాదరహిత, క్రమశిక్షణ గల నాయకులను పార్టీ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని టిడిపి సీనియర్లు సూచిస్తున్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పార్టీ పట్ల నిబద్ధతతో ఉన్న ఈ నేతలను గుర్తించి గౌరవించాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నారు. మరి ఈ నేతల రాజకీయ భవిష్యత్తు గురించి చంద్రబాబు ఏమి నిర్ణయం తీసుకుంటారో అనేది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.