
కార్యకర్తల డిమాండ్‌తో నియోజకవర్గంలో సందడి :
సోమవారం ఉదయం హిందూపురం పర్యటనలో భాగంగా బాలకృష్ణ కిరికెర గ్రామంలో స్థానికులతో మాట్లాడిన అనంతరం, బసవనపల్లి జడ్పీ హైస్కూల్ విద్యార్థులను కలిసేందుకు వెళ్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. కొందరు కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌కు అడ్డంగా నిలబడి, 'బాలయ్య బాబు గారు మంత్రి పదవి తీసుకోవాలని అభిమానుల కోరిక' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మరికొందరు రోడ్డుకు ఇరువైపులా నిలబడి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ అనూహ్య పరిణామాన్ని చూసిన బాలకృష్ణ కారు దిగి, ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. దేనికైనా సమయం వస్తుందని కార్యకర్తలకు నచ్చజెప్పి, అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుంచి ముందుకు కదిలారు. కాగా, బాలయ్యకు ఓపిక పట్టాలని, అవసరమైనప్పుడు పదవి వస్తుందని సర్దిచెప్పినట్లు సమాచారం.
మంత్రి పదవిపై బాలయ్యకు మక్కువ లేదా?:
టీడీపీ కంచుకోట హిందూపురం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బాలకృష్ణకు మంత్రి పదవిపై పెద్దగా మక్కువ లేదనే ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. బావ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అల్లుడు లోకేశ్ మంత్రిగా ఉన్నప్పుడు తనకు మంత్రి పదవి అవసరం లేదనేది ఆయన ఉద్దేశంగా చెబుతున్నారు. ముఖ్యమంత్రికి కుమారుడిగా, మరో ముఖ్యమంత్రికి వియ్యంకుడిగా ప్రభుత్వంలో 'సూపర్ పవర్స్' ఉన్నప్పటికీ, ఆయన ఎప్పుడూ తన పరిధి దాటి వ్యవహరించారనే విమర్శలు లేవు. తన నియోజకవర్గ అభివృద్ధి పనులను చూసుకోవడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం వరకే ఆయన పరిమితమయ్యారు.
అభిమానుల ఆశ... పార్టీలో అంతర్గత చర్చ :
ఎన్టీఆర్ తనయుడిగా, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, పార్టీ సీనియర్ నేతగా ఉన్న బాలకృష్ణకు మంత్రి పదవి చేపట్టేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని అభిమానులు, కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. ఈసారి కొత్తగా గెలిచిన వారికి, అలాగే పవన్ కళ్యాణ్ లాంటి వారికి మంత్రివర్గంలో చోటు దక్కిన నేపథ్యంలో, బాలయ్యకు కూడా మంత్రి పదవి దక్కాలని వారు ఆశిస్తున్నారు. ఆయన కోరుకుంటే మంత్రి అవ్వడం పెద్ద విషయమేమీ కాదని, అయితే సామాజిక సమీకరణలు, మంత్రివర్గ కూర్పు కారణంగా చంద్రబాబుపై ఒత్తిడి లేకుండా బాలయ్యే స్వచ్ఛందంగా దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాలు అంతర్గతంగా చెబుతుంటాయి. కానీ, తాజాగా హిందూపురంలో కార్యకర్తలు బహిరంగంగా చేసిన డిమాండ్‌ను చూస్తుంటే, బాలయ్యను ఒక్కసారైనా అమాత్య హోదాలో చూడాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఈ డిమాండ్ పార్టీలోనూ చర్చకు దారితీస్తోంది.
హిందూపురం: నందమూరి కుటుంబానికి కంచుకోట :
హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఇక్కడి నుంచే పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, ఆయన తనయులు హరికృష్ణ, బాలకృష్ణ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా, హరికృష్ణ రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు. బాలయ్య మూడుసార్లు గెలిచినా ఇప్పటివరకు మంత్రి పదవి చేపట్టలేదు. ఈ నేపథ్యంలో, అభిమానుల ఈ ఆకాంక్షను పార్టీ అధిష్టానం ఎలా పరిగణనలోకి తీసుకుంటుందో వేచి చూడాలి.