
వెరసి ఇక ఇలా మొబైల్స్ కి బానిసలుగా మారిపోతున్న మనుషులు చేసే పిచ్చి పనుల ద్వారా ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో సెల్ఫీ మోజులో పడిపోయి చేచేతులారా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఒకప్పుడు ఫోటో దిగాలంటే కెమెరామెన్ దగ్గరికి వెళ్లేవారు. కానీ ఇప్పుడు అద్భుతమైన ఫీచర్లతో ఉన్న మొబైల్స్ చేతిలో ఉన్నాక.. కెమెరామెన్తో అవసరం లేకుండా పోయింది. ఇక సెల్ఫీలు తీసుకుంటూ ప్రతిక్షణాన్ని మొబైల్లో బంధించాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతున్నారు.
ఈ క్రమంలోనే ప్రమాదం పొంచి ఉందని తెలిసినప్పటికీ ఇక సెల్ఫీ మోజులో పడిపోయి చివరికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇటీవలే ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ జిల్లాలో కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది. సెల్ఫీ మోజు చివరికి ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. రూర్కి చెందిన శివం, సిద్ధార్థ్ అనే ఇద్దరు యువకులు కుటుంబ సభ్యులతో కలిసి లక్సర్ ప్రాంతంలోని సోలాన్ని నది తీరానికి పూజల కోసం వచ్చారు. అయితే అక్కడికి సమీపంలో ఉన్న దోస్ని రైల్వే వంతెన పైకి వెళ్లి సెల్ఫీలు దిగడం ప్రారంభించారు. అదే సమయంలో డెహ్రాడూన్- ఢిల్లీ శతాబ్ది ఎక్స్ప్రెస్ వేగంగా దూసుకొచ్చింది. ఇద్దరు యువకులను రైలు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.