కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు భేటి అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో బీజేపీ ముద్రగడపై పెద్ద బాధ్యత పెట్టిందని వీర్రాజు వ్యాఖ్యానించారు. ఇంతకీ ముద్రగడపై పెట్టిన అంతపెద్ద బాధ్యత ఏమిటి ? అనే విషయమై రాజకీయంగా ఊహాగానాలు మొదలయ్యాయి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రాబోయే ఎన్నికల సమయానికి కాపులను బీజేపీకి మద్దతుగా సంఘటితపరిచే బాధ్యతను ముద్రగడకు వీర్రాజు అప్పగించారని సమాచారం. ప్రస్తుతం కాపు సామాజికవర్గం వివిధ పార్టీల మధ్య చీలిపోయింది. మొన్నటి ఎన్నికల్లో మెజారిటి వర్గం వైసీపీకి అనుకూలంగా నిలిచింది. దీని కారణంగానే ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీకి మంచి ఫలితాలు వచ్చాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా కాపు సామాజికవర్గం నేతే అయినప్పటికీ జనాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం ఉంచుకోవటం ఇక్కడ గమనించాలి.




మొదట్లో కాపు సామాజికవర్గంలో మెజారిటి సెక్షన్ టీడీపీతోనే ఉండేవారు. ఎప్పుడైతే వంగవీటి రంగా హత్య జరిగిందో అప్పటి నుండే కాపులు ముఖ్యంగా కోస్తాజిల్లాల్లో టీడీపీకి దూరమైపోయారు. కాపులందరినీ సంఘటితం చేసి ఏకతాటిపైకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరిగినా పెద్దగా ఫలించలేదు. 2009లో చిరింజీవి ప్రజారాజ్యంపార్టీ పెట్టినపుడు కాపు నేతల్లో మెజారిటి ఏకమైనా ఎందుకనో జనాలు మాత్రం చిరంజీవిని నమ్మలేదు. అయితే 2014 రాష్ట్ర విభజన జరిగిన సమయంలో పవన్ కల్యాణ్ వల్ల టీడీపీకి మెజారిటి కాపులు మద్దతిచ్చారు. కాపులను బీసీల్లో చేరుస్తానంటు చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీకి పవన్ గ్యారెంటి ఇవ్వటంతో టీడీపీకి మద్దతిచ్చారు. అయితే చంద్రబాబుది తప్పుడు హమీఅని, పవన్ గ్యారెంటీ చెల్లుబాటు కాదని కాపులకు తొందరగానే అర్ధమైపోయింది.




అందుకనే 2019 ఎన్నికల్లో ఇటు చంద్రబాబును అటు పవన్ను ఇద్దరికీ కొర్రుకాల్చి వాతలు పెట్టారు. టీడీపీని చిత్తుగా ఓడించటమే కాకుండా పవన్ పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోవటమే దీనికి నిదర్శనం. సరే చంద్రబాబు ఇఛ్చిన తప్పుడు హామీని అమలు చేయాలంటు గడచిన ఐదేళ్ళుగా ముద్రగడ పద్మనాభం నానా గోల చేస్తున్నారు. కాపులకు బీసీ రిజర్వేషన్ వర్తింపచేయటం రాజ్యాంగవిరుద్ధమని తెలిసీ ముద్రగడ అదే డిమాండ్ ను పట్టుకుని ఊగుతున్నారు.  ఇపుడు బీజేపీ కూడా అదే హామీని ఇస్తోంది. అందుకనే తమ హామీని కాపులు నమ్మి బీజేపీని ఆదరించేట్లుగా ముద్రగడను వీర్రాజు రంగంలోకి దింపినట్లు అర్ధమవుతోంది. బీజేపీలో చేరితే ముద్రగడ మీద వ్యతిరేకత వచ్చేస్తుందని అనుమానం వచ్చినట్లుంది. అందుకనే ఉద్యమనేతగానే ముద్రగడను కంటన్యు అయ్యేట్లుగా బీజేపీ ప్రోత్సహిస్తోంది. అవసరానికి బీజేపీకి మద్దతు పలికేట్లుగా ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. మరి జనాలు ముద్రగడను నమ్ముతారా ?

మరింత సమాచారం తెలుసుకోండి: