
అయితే.. ఈ కార్యక్రమం ఆసాంతం దేశమంతటా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. కొన్ని కోట్ల మంది టీవీ తెరల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూశారు. ప్రధాని మోడీ గంగాస్నానం చేయడం.. కాశీ విశ్వేశ్వరుని పూజించడం.. ఆ తర్వాత కాశీ కారిడార్‌ను నిర్మించిన కార్మికులతో కలసి భోజనం చేయడం.. సాయంత్రం గంగా హారతిలో పాల్గొనడం.. అంతా టీవీ తెరలపై ప్రత్యేక శ్రద్ధతో ఆవిష్కరించారు. ప్రధాని మోడీ స్వయంగా వారణాసి ఎంపీ కూడా అన్న సంగతి తెలిసిందే.
ఓవైపు యూపీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఆ తర్వాత మరో రెండేళ్లకు సార్వత్రిక ఎన్నికలు వచ్చేస్తాయి. యూపీ ఎన్నికల్లో సత్తా చాటితేనే సార్వత్రిక ఎన్నికల నాటికి ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఇప్పటికే అయోధ్యలో రామాలయం నిర్మాణం పూర్తి కావస్తోంది. సరిగ్గా అయోధ్య రామాలయం కూడా ఎన్నికలకు కాస్త ముందుగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అటు అయోధ్య రామాలయ నిర్మాణం, ఇటు కాశీ కారిడార్ నిర్మాణం.. రెండూ అత్యంత ప్రతిష్టాత్మకమైనవే.
భారతీయ హిందువులంతా గర్వపడే అంశాలే. మరి ఈ అంశాలు ప్రధాని మోడీని మరోసారి ప్రధాని పీఠం పై కూర్చోబెడతాయా.. ఇప్పటికే రెండు సార్లు ప్రధాని అయిన మోడీని.. మరోసారి కాశీ విశ్వనాథుడు, అయోధ్య రాముడు మరోసారి అవకాశం ఇస్తారా.. అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ. మరి మీరేమంటారు..?