ఏపీ స్కూళ్లలో మరో విప్లవాత్మకమైన మార్పు మొదలైంది. ఇప్పటికే నాడు నేడు వంటి కార్యక్రమాలతో పాఠశాలల రూపు రేఖలు మారుస్తున్న జగన్ ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక మార్పును అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాల అంటే ఇప్పటి వరకూ టీచర్ ఎప్పుడు వచ్చినా పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు.. కానీ ఇకపై టీచర్లు ఠంచనుగా సమయానికి రావాల్సిన పరిస్థితి కల్పించారు.


ఎందుకంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరును ఏపీ విద్యాశాఖ  ఆన్‌లైన్‌ చేసేసింది. దీనికోసం పాఠశాల విద్యాశాఖ ఫేస్‌ రికగ్నైజ్డ్ హాజరు నమోదు చేసేలా ప్రత్యేకంగా ఓ యాప్ ను తీసుకొచ్చింది. ఇవాళ్టి నుంచి ఉపాధ్యాయులంతా ఈ యాప్‌లో హాజరు వేయాల్సిందే. ఇకపై దీన్నే ప్రామాణికంగా తీసుకుంటామని విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఉపాధ్యాయుల సెల్ ఫోన్లోనే దీన్ని డౌన్లోడ్ చేసుకుని, తమ ఫొటోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.


ఇక ప్రతిరోజూ పాఠశాల వద్ద యాప్ ఓపెన్ చేసి తమ హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా ఆ రోజు హాఫ్ డే అటెండెన్స్ మాత్రమే వస్తుంది.  ఉదయం పాఠశాలకు వచ్చినప్పుడే కాదు.. సాయంత్రం తిరిగివెళ్లేటప్పుడు కూడా అంటే.. రెండు సార్లు హాజరు నమోదు చేయాల్సిందే. ఈ యాప్ ఆధారిత హాజరు నమోదుకు నెట్‌వర్క్‌ సమస్య లేకుండా ఆఫ్‌లైన్‌ ఎంపిక అవకాశం ఇచ్చామంటున్నారు అధికారులు. సిగ్నల్ వచ్చిన తర్వాత డేటా సర్వర్‌కు వస్తుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.


ఉపాధ్యాయులు.. పాఠశాలకు అరగంట ముందే వస్తే హాజరు నమోదు ఆలస్యమవుతుందనే సమస్యే ఉండదంటున్నారు అధికారులు. సర్కారు బడి ఉపాధ్యాయులంటే.. ఇక ఎవరికీ జవాబు దారీ కాదు అనే సమస్య ఉండకుండా ఈ హాజరు నిబంధన తీసుకొచ్చారు. వేలకు వేలు జీతాలు తీసుకునే ఉపాధ్యాయులు.. అందుకు తగినట్టుగా పని చేస్తే.. రాష్ట్రంలో విద్యార్థుల భవితవ్యం బంగారుమయం అవుతుందనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: