- ( అమ‌రావతి - ఇండియా హెరాల్డ్ ) . . .

రాష్ట్రంలో ఎన్నికలు జరిగేందుకు మరో నాలుగేళ్ల సమయం ఉంది. ప్రస్తుతం కూటమి సర్కారు పాలనను ఇప్పుడిప్పుడే పట్టాలు ఎక్కిస్తోంది. ఇంతలోనే ఎన్నికల ముచ్చట‌ తెరమీదకి వచ్చింది. ఇదేదో వైసీపీ నాయకులు ..ఆ పార్టీ అధినేత జగన్ చెప్పిన మాట కాదు సాక్షాత్తు కూటమి నడిపిస్తున్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు చెప్పిన మాట‌. త‌మ పార్టీ కార్యకర్తలు .. నాయకుల ముందు వచ్చే ఎన్నికలకు సంబంధించిన ముచ్చట తెరమీదకు తీసుకురావడం ఆసక్తికరం. ఎన్నికలలో సీట్లు దక్కాలంటే ఇలా ఉండండి .. ఇలా చేయండి అంటూ క్లాసు ఇచ్చారు. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఏ నాయకుడు అయినా ఏ పార్టీ అయినా ఎన్నికలకు ముందు ఏడాది పార్టీ నాయకులను అప్రమత్తం చేస్తుంది. ప్రతిపక్షంలో ఉంటే ఒకటి రెండేళ్ల ముందు నుంచే నాయకులను లైన్లో పెడతారు.


కానీ తాజాగా చంద్రబాబు అధికారంలో ఉండి ... ఎన్నికలకు మరో నాలుగేళ్ల‌ సమయం ఉండి కూడా ఎన్నికల ప్రస్తావన తీసుకురావడం కాస్త ఆశ్చర్యకరం. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు రెండుసార్లు సర్వే చేయించుకున్నారు. చాలామందికి నెగిటివ్ మార్కులు వచ్చాయి. ఈ రిపోర్టులు చూసిన చంద్రబాబు కొందరు ఎమ్మెల్యేలపై తీవ్రమైన అసంతృప్తి, అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకటి రెండు సార్లు పార్టీ ఆఫీసు నుంచి వార్నింగ్లు ఇప్పించినా వారిలో మార్పు రాలేదన్న నివేదికలు మరోసారి ఆయన వద్దకు చేరాయి.


సొంత పార్టీలోనే గ్రూపుల గోల‌ పెరిగిపోయినా .. ఎమ్మెల్యేలు వాటిని ఎంకరేజ్ చేస్తూ ఒక వర్గానికి కొమ్ముకాస్తూ ఉండటం చంద్రబాబుకు ఏమాత్రం నచ్చలేదు. అందుకే చంద్రబాబు ఇలా ఎన్నికలు బూచని చూపించి వారిని పరోక్షంగా సుతిమెత్తగా హెచ్చరించారని పార్టీలో ఇప్పుడు చ‌ర్చ‌ నడుస్తోంది. మీరు సరిగా ఉంటే మంచిది లేకపోతే నాయకులను తయారు చేసుకునేందుకు పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అని ఎవరి పేరు ప్రస్తావించకుండా ఆయన వ్యాఖ్యానించారు. దీనిని బట్టి చంద్రబాబు ఎన్నిక‌ల ముచ్చ‌ట వెన‌క సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నాయ‌కుల‌ను అలెర్ట్ చేయ‌డ‌మే ముఖ్య ఉద్దేశంగా క‌నిపిస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: