టీడీపీ నాయకుల ప్రవర్తనపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. తాను పదేపదే హెచ్చరించినా కొందరు నాయకులు పట్టించుకోకపోవడం, విన్నట్టే నటించి తిరిగి తమదైన పనులు చేసుకోవడం ఆయనను తీవ్రంగా కలవరపరుస్తోంది. “అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు?” అనే ప్రశ్నను స్వయంగా లేవనెత్తిన చంద్రబాబు, ఈ వ్యవహారంపై అంతర్గతంగా సమీక్ష నిర్వహించారు. ఇటీవ‌ల  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రెండు గంటలకు పైగా పార్టీ నేతలతో చర్చించిన చంద్రబాబు, ముఖ్యంగా పార్టీ పరువుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీల తీరుపై సీరియస్‌గా మాట్లాడినట్టు తెలుస్తోంది. ప్రజల సమస్యల కంటే వివాదాల చుట్టూ తిరుగుతున్న కొందరు నాయకుల ధోరణి ఆయనను కంగారు పెట్టింది.


ఇప్పటికే రెండు మూడు సార్లు వారిని హెచ్చరించినా మార్పు కనిపించకపోవడంతో, ఈసారి మరింత కఠినంగా స్పందించినట్టు సమాచారం. ఇక, “ మనోళ్లు వేరే పార్టీలతో టచ్‌లో ఉన్నారా ? ” అన్న అనుమానం చంద్రబాబు మనసులో బలంగా ఉందని చెబుతున్నారు. వాస్తవానికి కొందరు టీడీపీ నాయకులు వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని గతంలోనూ వార్తలు వచ్చాయి. ఇటీవల కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వైసీపీ నేత శ్రీకాంత్‌కి పెరోల్‌ రావడం వివాదమయ్యింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి కూడా వైసీపీ నేతలతో టచ్‌లో ఉన్నారని ప్రచారం జరిగింది. ఇదే విధంగా ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలూ వైసీపీ అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి.


ఈ పరిస్థితుల్లో వారిపై కఠిన చర్యలు తీసుకుంటే, వారు నేరుగా వైసీపీలో చేరిపోవడమే కాకుండా కండువా మార్చే అవకాశమూ ఉందన్న చర్చ పార్టీ అంతర్గతంగా జరుగుతోంది. ఇక బీజేపీ కూడా నేతలను ఆకర్షించేందుకు సిద్ధంగానే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల బీజేపీ నేత మాధవ్ పరోక్షంగా ఈ విషయాన్ని ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద, పార్టీ లోపల జరుగుతున్న ఈ పరిణామాలు చంద్రబాబును తీవ్ర ఆలోచనలో పడేశాయి. ఒకవైపు పార్టీని కాపాడుకోవాలన్న బాధ్యత, మరోవైపు నియంత్రణ తప్పుతున్న నాయకుల వ్యవహారం ఈ రెండింటి మధ్య తర్జనభర్జన పడుతున్న చంద్రబాబు, త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: