ఉసిరికాయ అంటే తెలియని భారతీయుడు ఉండడు. భారతీయ సాంప్రదాయం ప్రకారం కార్తీకమాసంలో ఈ చెట్టును దేవతా వృక్షంగా పూజలు చేస్తారు. అంతేకాకుండా ఆరోగ్య పరంగా కూడ అనేక ఆరోగ్య సమస్యలను నివారించే గుణాలు ఈ ఉసిరికాయలో ఉండటంతో ఆయుర్వేద వైద్యంలో ఉసిరికి చాల ఎక్కువ ప్రాధాన్యత ఉంది. 

విటమిన్ ‘సి’ అధికంగా ఉండే ఉసిరికాయలను, గింజలను, ఆకులను పూలను, బెరడును ఆయుర్వేద ఔషధాలలో, సౌందర్య సాధనాలలో విరివిగా ఉపయోగిస్తారు. ఇంటి ఆవరణలో ఉసిరి చెట్టు ఉంటే ఆ ఇంటి వాస్తు దోషాలు పోతాయని వాస్తు పండితులు చెపుతారు. ఇటువంటి ఉసిరిని తినడం వల్ల శరీరంలోని కొవ్వును బాగా తగ్గించు కోవచ్చు అని వైద్యులు చెపుతారు.

ప్రతిరోజు ఉదయం ఉసిరి జ్యూస్ ను తాగితే మూత్రాశయ సమస్యలు రావడం బాగా తగ్గుతుంది అని అంటారు. రాబోతున్న వేసవికాలంలో మండే ఎండ తాపాన్ని తగ్గించుకోవడంలో కూడ ఉసిరి బాగా ఉపయోగ పడుతుంది. అంతేకాదు మలబద్దకానికి ఉసిరికాయ దివ్య ఔషదంగా చెపుతారు. ఉదయాన్న పరగడుపున ఉసిరి రసం తేనె కలిపి తీసుకుంటే రక్త శుద్ధి జరుగుతుందని ఆయుర్వేద వైద్యులు చెపుతూ ఉంటారు.

ఉసిరిని వాడటం వలన ఉదర సంబంధిత వ్యాధులే కాకుండా కంటి చూపుకు సంబంధించిన సమస్యలు కూడ నివారణ అవుతాయి. ఉసిరి కాయలో క్రోమియం అధికంగా ఉండటం వల్ల మధుమేహం వ్యాధి అదుపులోకి వస్తుంది. అంతేకాదు ఉసిరి జ్యూస్ ను పసుపుతో కలిపి తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాదుల నుంచి బయటపడే ఆస్కారం ఉంది. ఉసిరిలో యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల మన వయసు పెరిగినా శరీరం ముడతలు పడకుండా వృద్ధాప్య ఛాయలు రావు. ఇలా ఎన్నో ఉపయోగాలతో కూడిన ఉసిరికాయ అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్య ఔషదం..
   



మరింత సమాచారం తెలుసుకోండి: