నరేష్ టైమింగ్, మ్యూజిక్, ఫస్ట్ హాఫ్ కామెడీ నరేష్ టైమింగ్, మ్యూజిక్, ఫస్ట్ హాఫ్ కామెడీ హీరోయిన్స్ , డైరక్షన్, ఎడిటింగ్

రాజా (అల్లరి నరేష్) ఓ మ్యారేజ్ బ్యూరో నడిపిస్తుంటాడు. అతనికున్న వీక్ నెస్ ఎప్పుడు పడితే అప్పుడు సెల్ఫీలు దిగడమే. ఉదయం లేవడమే సెల్ఫీతో డే స్టార్ట్ చేస్తుంటాడు. అయితే తను తీసే సెల్ఫీలతో అవతలవారిని అడ్డంగా బుక్ చేస్తూ వారందరు తన మీద గొడవకు వచ్చేలా చేసుకుంటాడు. అదొక్కటే కాదు నోటికి దూల ఎక్కువ. ఇక అలాంటి సెల్ఫీ రాజా శ్వేతను (కామ్న రనౌత్)ను మొదటి చూపులోనే ఇష్టపడి ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. శ్వేత కూడా రాజా లవ్లో పడుతుంది. శ్వేత ఫాదర్ పోలీస్ కమీషనర్ (నాగినీడు) పెళ్లికి ఒప్పుకోవడం పెళ్లి జరిగిపోవడం అంతా జరుగుతుంది. పెళ్లి తర్వాత ఓ చిన్న గొడవతో రాజా శ్వేతలు విడిపోతారు. ఇక జీవితం బరువెక్కడంతో చనిపోవాలనుకున్న రాజా కిల్లర్ ఖాకి (రవిబాబు)కు తనను చంపే కాంట్రాక్ట్ ఇస్తాడు. ఇక్కడే షాక్ తనను చంపేందుకు ముంబై నుండి వచ్చిన భీమ్స్ కూడా అచ్చం రాజాలానే ఉంటాడు. ఇతంకీ రాజాను భీమ్స్ ఏం చేశాడు..? రాజాను చంపేందుకు భీమ్స్ మనుషులే కాకుండా మరో బ్యాచ్ ఎందుకు ప్రయత్నం చేస్తుంది..? రాజా శ్వేతలు కలిశారా లేదా..? అన్నది అసలు కథ.      

సెల్ఫీ రాజా, భీమ్స్ క్యారక్టర్స్ లో అల్లరి నరేష్ మరోసారి ద్విపాత్రాభినయం చేశాడు. ఇదవరకు డ్యుయల్ రోల్ చేసినా ఈ సినిమాలో నరేష్ కాస్త కొత్తగా కనిపించాడు. అంతేకాదు లుక్ విషయంలో కూడా అల్లరి నరేష్ ఇందులో సూపర్ అనిపించాడు. కాని రొటీన్ కామెడీనే అయ్యేసరికి ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు. ఇక హీరోయిన్ గా చేసిన కామ్న రనౌత్ ఓకే అనిపించుకుంది. సినిమాలో ఆమెకు అంత ఎక్కువ స్కోప్ లేదు. ఇకపోతే సెకండ్ హీరోయిన్ గా సాక్షి చౌదరి నటించింది. సాక్షి అందాలు అక్కడక్కడ సినిమాకు ప్లస్ అయ్యాయి. అంతేతప్ప తను కూడా అంత ఇంప్రెస్ చేయలేదు. ఇక నాగినీడు క్యారక్టర్ కమీషనర్ గా ఓకే అనిపించేలా ఉన్నా ఓ కమీషనర్ అంత సుతిమెత్తగా ఉంటాడా అన్న డౌట్ వస్తుంది. ఇక కమెడియన్స్ కృష్ణ భగవాన్, సప్తగిరి, తాగుబోతు రమేష్ చేసిన కామెడీ ఓ ఎత్తైతే జబర్దస్థ్ టీం మొత్తం ఇందులో రకరకాల పాత్రల్లో అలరించడం విశేషం. ముఖ్యంగా అంకుశం పోలీస్ గా ప్రుధ్వి మరోసారి ఇరగదీశాడు. 

ఈశ్వర్ రెడ్డి అనుకున్న సెల్ఫ్రీ రాజా పాయింట్ ఓకే అనిపించేలా ఉన్నా ఇదే సబ్జెక్ట్ తో ఇదవరకే సినిమాలు చూశామన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక దర్శకుడిగా కథనం ఏమన్నా గ్రిప్పింగ్ తో నడిపించాడా అంటే కొన్ని చోట్ల కామెడీ వర్క్ అవుట్ అయినా మరికొన్ని చోట్ల మాత్రం కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఇక సినిమాకు సాయి కార్తిక్ అందించిన పాటలు బాగున్నాయి. నరేష్ సినిమా రేంజ్ కు ఈ పాటలు ఇవ్వడం మంచి విషయం. పాటలను పిక్చరైజ్ చేసిన విధానం కూడా బాగుంది. కెమెరామన్ పనితనం బాగుంది. ఎడిటర్ ఎం.ఆర్ వర్మ సినిమా ఇంకాస్త ట్రిం చేసుంటే బాగుండేది.. అక్కడక్కడ జర్క్ లు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక సినిమా నిర్మాణ విలువల విషయానికొస్తే కథకు తగ్గట్టు ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టడంలో ఏమాత్రం వెనుకాడలేదు. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమా కూడా రిచ్ గానే అనిపించింది. 

సాధారణం గా అల్లరి నరేష్ సినిమాలంటేనే లాజిక్ లన్ని పక్కన పెట్టేసేయాలి. సెల్ఫీ రాజా టైటిల్ తో వచ్చిన ఈ సినిమాలో మొదట సెల్ఫీ పిచ్చి ఉన్న హీరో పాత్ర దాని వల్ల వచ్చిన గొడవలు చూపించడం ఓకే కాని తర్వాత సినిమాలో ఆ టైటిల్ జస్టిఫికేషన్ ఉండదు. ఇక లాస్ట్ ఫైట్ లో మళ్లీ సెల్ఫీ అంటూ ప్రస్తావనకు తెస్తారు. ఇక సినిమా మొదలవగానే కాళిదాసుని అరెస్ట్ చేసినందుకు కమీషనర్ మీద పగ పెంచుకున్నాడు. పదేళ్ల తర్వాత అదే పగతో ఈసారి తన ఫ్యామిలీ అంటే తన కూతురు చేసుకున్న భర్తను చంపాలని చూస్తాడు. ఇది ఒక పాయింట్. 


ఇక శ్వేత చీ పొమ్మన్నాక తన చావు తానే చద్దామని కిల్లర్ కు కాంట్రాక్ట్ ఇస్తే అతనేమో సేం టు సేం రాజాలా ఉన్న భీమ్స్ ను పెట్టి రాజాను చంపి ఇన్సూరెన్స్ డబ్బులు కాజేయాలనుకుంటారు. రాజా తనంతట తాను చనిపోయే సందర్భంలోనే ఓ విలన్ నాగరాజు చేతిలో తాను చావబోయి అతనే తల నరుక్కుని చనిపోయేలా చేస్తాడు. ఇక ఆ కసితో నాగరాజు భార్యలు రాజా కోసం వెతుకుతుంటారు. సో ఇలా మూడు గ్యాంగ్ లు రాజాని చంపాలని చూస్తాయి. ఇక రాజాని పోలిన భీమ్స్ వారికి దొరకడం వారి నుండి భీమ్స్ తప్పించుకునే ప్రయత్నాలు నవ్వు తెప్పిస్తాయి.         


అయితే కథను కావాలనే కన్ ఫ్యూజ్ చేసి ప్రేక్షకులు ఇబ్బంది పడేలా చేశాడు దర్శకుడు ఈశ్వర్ రెడ్డి. తాను చెప్పదలంచుకున్న పాయింట్ కాస్త కామెడీతో మిక్స్ చేసి చెప్పడంలో విఫలమయ్యాడు. నరేష్ సినిమా అంటే కొన్ని సీన్స్ అదరగొడతాయన్నట్టు ఇందులో బాహుబలి స్పూఫ్ తో ట్రాఫిక్ పోలీస్ ద్రంక్ అండ్ డ్రైవ్ రైడ్ దగ్గర వచ్చే కామెడీ ఆడియెన్స్ కు మంచి ఎంటర్టైన్ మెంట్ ఇస్తుంది. ఇక అక్కడక్కడ  బెంగాల్ టైగర్, బాహుబలి స్పూఫ్ లను చేస్తూ సినిమాను రన్ చేశారు.            

క్లైమాక్స్ లో కాళిదాసు, రాజా అండ్ ఫ్యామిలీ మొత్తాన్ని కిడ్నాప్ చేసి చంపేయాలని చూస్తుంది. అయితే అక్కడ ఉంది భీమ్స్ అని సెల్ఫీ రాజా ఎంట్రీ వచ్చాక అర్ధం అవుతుంది. సో ఫన్ని క్లైమాక్స్ తో సినిమా ముగింపు పలుకుతుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎంజయ్ చేసినట్టే అనిపిస్తుంది. తీరా బయటకు వస్తే మాత్రం ఏమి ఉండదు. హీరోయిన్స్ పేరుకి ఇద్దరు ఉన్నా ఒక్కరు కథకు కనెక్ట్ అయ్యేలా ఉండరు. ఓ విధంగా చెప్పాలంటే మొదటి హీరోయిన్ కామ్న రనౌత్ కన్నా సెకండ్ హీరోయిన్ గా చేసిన సాక్షి చౌదరికి కాస్త ఎక్కువ స్కోప్ ఉన్నట్టు అనిపిస్తుంది. కేవలం ఎంటర్టైన్మెంట్ కావాలి లాజిక్ లు ఏమి వద్దు అనుకున్న వారికి అల్లరి నరేష్ చూపించిన సెల్ఫీ రాజా కామెడీ నచ్చే అవకాశం ఉంటుంది. రొటీన్ కామెడీతో నడిచే ఈ సినిమా అందరికి నచ్చే అవకాశం లేదు.


Allari Naresh,Sakshi Chowdhary,Kamna Ranawat,G Eshwar Reddy,Chalasani Rambrahmam Choudary,Sai Karthikసగం నవ్వుల సెల్ఫీరాజా...!

మరింత సమాచారం తెలుసుకోండి: