కొన్నాళ్లు నుంచి ఇండియన్ సినిమాకు బాహుబలి ఫీవర్ పట్టుకుంది. బాహుబలి 2 విడుదల సందర్భంగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.. అన్న ప్రశ్నతో మొదలైన సందడి.. ఆ సినిమా విడుదల తర్వాత కూడా కొనసాగుతోంది. దేశ సినీ చరిత్రలోనే ఏ భారతీయ సినిమా కూడా సాధించలేనన్ని వసూళ్లు ఇప్పటికే సాధించిన రికార్డులు సృష్టించింది.
కేవలం కలెక్షన్ల సునామీయే కాదు.. దేశంలోని ప్రముఖ సినీదిగ్గజాల ప్రశంసలు అందుకుంది. ఐతే.. బాహుబలిపై విమర్శలు కూడా లేకపోలేదు. ప్రత్యేకించి కొందరు హిందీ, తమిళ సినీప్రముఖులు బాహుబలి సంచలన విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారనే చెప్పాలి. ఇప్పటికే చేరన్ వంటి దర్శకులు బాహుబలిపై కామెంట్లు చేయగా.. తాజాగా కమల్ హాసన్ కూడా బాహుబలిపై నెగిటివ్ కామెంట్లు చేయడం విశేషం.
బాహుబలి సినిమాను కాపీ సినిమాగా కమల్ హాసన్ వర్ణించడం విశేషం. 'బాహుబలి' సినిమా మహాభారతానికి, తమిళ ఫాంటసీ టీవీ సిరీస్ 'అంబులి మామ'కు కాపీ అని కమల్ కామెంట్ చేశాడు. అంతే కాదు.. 'బాహుబలి' సినిమా వల్ల తనపై ఎలాంటి ఒత్తిడి లేదని అంటున్నాడు. గొర్రెలన్నీ ఒకదాని వెనుక ఒకటి వెళ్తాయని, మందతో కలిసి ముందుకు పోవడానికి తానేమీ గొర్రెను కానని కమల్ చెప్పుకొచ్చాడు.