29 సంవత్సరాల విజయ్ దేవరకొండ 36 సంవత్సరాల నయనతారల మధ్య రొమాన్స్ ఊహించుకోవడం కష్టం. అయితే సంచలనాలు చేయడమే తన ట్రెండ్ గా మార్చుకున్న విజయ్ దేవరకొండ నయనతారతో కలిసి ఒక సినిమాలో హీరో హీరోయిన్స్ గా నటించబోతున్నట్లు కోలీవుడ్ మీడియా ఆసక్తికర కథనాలు వ్రాస్తోంది.
తెలుస్తున్న సమాచారం మేరకు ప్రముఖ తమిళ ఫిలిం మేకర్ ఎస్.ఆర్. ప్రభు ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుడుతున్నట్లు టాక్. తెలుగు తమిళ భాషలలో ఒకేసారి నిర్మింపబడే ఈమూవీ కథ చాల వైవిద్యంగా ఉంటుందని తెలుస్తోంది. మధ్య వయస్కురాలు అయిన ఒక అమ్మాయికి యుక్త వయస్సులో ఉన్న ఒక అబ్బాయికి అనుకోకుండా ఏర్పడిన సున్నితమైన ప్రేమ చుట్టూ ఈ డిఫరెంట్ కథను అల్లినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈమూవీలో నటించడానికి ఇప్పటికే నయనతారతో పాటు విజయ్ దేవరకొండ కూడ అంగీకారం తెలపడంతో ఈమూవీ స్క్రిప్ట్ వర్క్ చాల వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. నయనతార విజయ్ దేవరకొండలకు ఉన్న క్రేజ్ రీత్యా ఈమూవీ ప్రాజెక్ట్ సంచలనంగా మారడమే కాకుండా భారీ స్థాయిలో దక్షిణాది యావత్తూ బిజినెస్ జరుగుతుందని అంచనాలు వస్తున్నాయి.
ఎటువంటి పాత్రలో అయినా ఒదిగిపోయి నటించే నయనతార విజయ్ దేవరకొండలకు ఈమూవీలోని పాత్రలు విపరీతమైన పేరు తెప్పిస్తాయని కోలీవుడ్ మీడియా ఊహాగానాలు చేస్తోంది. ప్రస్తుతతరం అమ్మాయిలకు మోస్ట్ డిజైరబుల్ పర్సన్ గా అత్యున్నత ర్యాంకింగ్స్ తెచ్చుకుంటున్న విజయ్ దేవరకొండ సీనియర్ హీరోయిన్ నయనతారతో నటించడం మన తెలుగు రాష్ట్రాల విజయ్ దేవరకొండ అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి..