తెలుగు సినిమాలు అప్పుడప్పుడు హిందీలో రీమేక్ అవుతూ ఉంటాయి. అయితే.. ఈ ఫ్లో ఈ మధ్య పెరిగింది. గేట్లు ఎత్తేశారు. 10..15 తెలుగు సినిమాలు బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్నాయి. పెద్ద సినిమాల కంటే.. చిన్న చిత్రాల కథలనే బాలీవుడ్‌ మేధావులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

బాహుబలి ఘన విజయం తర్వాత బాలీవుడ్‌ దృష్టి టాలీవుడ్‌పై పడింది. ఇక్కడ ఏయే సినిమాలు రూపొందుతున్నాయి... కథలేమిటో .. తమకు సరిపోతాయోలేదో తెలుసుకుంటున్నారు. పోకిరి.. విక్రమార్కుడు వంటి రీమేక్స్‌ అక్కడి స్టార్స్‌కు బంపర్‌హిట్స్ ఇచ్చాయి. బాహుబలి తర్వాత  అర్జున్‌రెడ్డి కబీర్‌సింగ్‌గా రీమేక్‌ అయితే.. 300 కోట్లు కలెక్ట్ చేసింది. టెంపర్‌ను సింబాగా  రీమేక్‌ చేయగా.. 200 కోట్లు తెచ్చిపెట్టింది. రీమేక్స్‌ బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను భారీ లాభాలు తీసుకురావడంతో... మరిన్ని తెలుగు కథలను కొనేశారు.

బన్నీ సినిమాలు రేసుగుర్రం... దువ్వాడ జగన్నాథమ్‌ను బాలీవుడ్‌ తెరపైకి వెళ్తున్నాయి. యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మెప్పించిన రేసుగుర్రం.. దువ్వాడ జగన్నాథమ్‌ కోసం హిందీ హీరోల అన్వేషణ మొదలైంది. ఊసరవెల్లి ఏవరేజ్‌గా ఆడినా.. సురేంద్రరెడ్డి మేకింగ్‌.. ఎన్టీఆర్‌ యాక్టింగ్‌ బాలీవుడ్‌కు నచ్చి రీమేక్ చేస్తున్నారు.

రీమేక్‌ రైట్స్‌తో చిన్న చిత్రాలకు ఎగస్ట్రా ఇన్‌కం వస్తోంది. తనికెళ్లభరణి దర్శకత్వంలో బాలు, లక్ష్మి నటించిన మిథునం అవార్డులు తీసుకొచ్చింది. మిథునం హిందీ రీమేక్‌లో అమితాబ్, రేఖ కలిసి నటిస్తారన్న వార్త బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఇదే నిజమైతే.. ఈ హిట్‌ పెయిర్‌ను మరోసారి కలిపిన క్రెడిట్‌ మిథునానికే దక్కుతుంది.

తెలుగు సినిమాలు బాలీవుడ్‌లో క్యూ కట్టాయి. నాని నటించిన జెర్సీ హిందీ రీమేక్‌లో షాహిద్‌ కపూర్‌ నటిస్తున్నాడు. కబీర్‌సింగ్‌ హిట్‌ కావడంతో మరోసారి రీమేక్‌నే నమ్ముకున్నాడు షాహిద్‌. అలా వైకుంఠపురంలో.. టాక్సీవాలా.. హిట్‌.. బ్రోచేవారెవరురా... మత్తువదలరా సినిమాల హిందీ రీమేక్‌ రైట్స్‌ ఇప్పటికే అమ్ముడయ్యాయి. ఈ దూకుడు చూస్తుంటే.. హిందీలో సినిమా రిలీజ్‌ అయితే.. ఏ తెలుగు సినిమాకు రీమేక్‌ అని బాలీవుడ్‌ ఆడియన్స్‌ అడుగుతారేమో.





మరింత సమాచారం తెలుసుకోండి: