ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా మిథున్ వరదరాజ కృష్ణన్ తెరకెక్కిస్తున్న చిత్రం 'డ్యూయెట్'. దీన్ని కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. రితిక నాయక్ కథానాయిక. శుక్రవారం ఆనంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆయన పాత్ర లుక్‌ను విడుదల చేశారు. అందులో తను మనసంతా ప్రేయసినే నింపుకున్న ప్రేమికుడిలా ఆసక్తికరంగా కనిపించారు. ఇందులో తన పాత్ర పేరు మదన్. ''ఓ విభిన్నమైన ప్రేమకథతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇది ప్రస్తుతం చిత్రీకరణ దశలోనే ఉంది. త్వరలో ఫస్ట్‌లుక్‌తో పాటు మరిన్ని వివరాలు వెల్లడించనున్నాం'' అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: జి.వి.ప్రకాశ్ కుమార్, ఛాయాగ్రహణం: అరుణ్ రాధాకృష్ణన్.వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో ఫస్ట్ కట్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'అర్జునుడి గీతోపదేశం'. అఖిల్‌రాజ్, దివిజ ప్రభాకర్, వాసంతిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. సతీశ్ గోగాడ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిలోక్‌నాథ్.కె, ప్రదీప్‌రెడ్డి.వి నిర్మాతలు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కె.అమ్మిరాజు క్లాప్‌నివ్వగా, మల్లెల సీతారామరాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. త్రిలోక్‌నాథ్, పూజిత స్క్రిప్ట్ అందించారు. లక్కంశెట్టి వేణుగోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ''ఇదే నా తొలి చిత్రం. వినూత్నమైన కథతో స్క్రిప్ట్ రాసుకున్నా. చెప్పగానే నటులు ఆసక్తిని కనబరిచారు. అమలాపురంలో తొలి షెడ్యూల్ చిత్రీకరణని మొదలు పెడుతున్నాం. విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నైలో చిత్రీకరణ జరుపుతాం'' అన్నారు. ''పేరు ఎంత ఆసక్తికరంగా ఉందో, ఈ కథ కూడా అలాగే ఉంటుంద''ని నిర్మాత తెలిపారు. రాజీవ్, ఆదిత్య శశికుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: చైతన్య కందుల, కళ: కె.వి.రమణ, కూర్పు: అర్జున్, సంగీతం: చరణ్ అర్జున్.
సూర్యతేజ ఏలే కథానాయకుడిగా... కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'భరతనాట్యం'. మీనాక్షి గోస్వామి కథానాయిక. పాయల్ సరాఫ్ నిర్మాత. ఏప్రిల్ 5న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు ప్రకటించాయి. ''దర్శకుడు కావాలనుకున్న ఓ యువకుడి కథ ఇది. సినిమా కోసం తను రాసుకున్న కథలో ఏం జరిగిందో, తన జీవితంలోనూ అదే జరిగినప్పుడు ఆ యువకుడు ఏం చేశాడు? చుట్టు ముట్టిన సమస్యల్ని ఎలా అధిగమించాడనే విషయాలు ఆసక్తికరం. వేసవి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రం తప్పకుండా వినోదాన్ని పంచుతుంద''ని సినీ వర్గాలు తెలిపాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి