నేటి టెక్నాలజీ సాయంతో పాత సినిమాలకు మెరుగులు దిద్ది మళ్లీ రిలీజ్‌ చేసే ట్రెండ్ ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా నడుస్తోంది. ఇప్పటికే 4కెలో చాలా చిత్రాలు రీ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్ మేకర్స్ మరొక అడుగు ముందుకేశారు. పాత చిత్రాలకు కొత్త సాంగ్స్ జోడించి నయా ట్రెండ్ కు తెరలిపారు. `లక్ష్మీ నరసింహ` చిత్రం ఈ ట్రెండ్ కు నాంది పలికింది.


జయంత్ సి. పరంజీ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా తెర‌కెక్కిన యాక్ష‌న్ మూవీ ఇది. ఆసిన్ హీరోయిన్‌గా యాక్ట్ చేయ‌గా.. మణి శర్మ సంగీతం అందించారు. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బెల్లంకొండ సురేష్ నిర్మించిన ల‌క్ష్మీ న‌ర‌సింహ మూవీ 2004 సంక్రాంతి కానుక‌గా విడుద‌లై సూప‌ర్ హిట్ గా నిలిచింది. అయితే జూన్ 10 బాల‌య్య బ‌ర్త్‌డే కానుక‌గా ఈ చిత్రాన్ని గోల్డెన్ టర్టెల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ రీ రిలీజ్ చేసేందుకు రెడీ అయింది.


ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు లక్ష్మీ నరసింహ మూవీని థియేట‌ర్స్ లో ప్రదర్శించనున్నారు. అయితే ఇక్క‌డో ప్ర‌త్యేక ఉంది. ఈ సినిమాకు కొత్త‌గా మ‌రో సాంగ్ ను కూడా యాడ్ చేసి రీ రిలీజ్ చేయ‌బోతున్నారు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అప్ప‌ట్లో ల‌క్ష్మీ న‌ర‌సింహ‌లో హీరో క్యారెక్టర్‌ను హైలైట్ చేసేలా ఓ పాట‌ను షూట్ చేశారు. కానీ ఫైన‌ల్ క‌ట్ లో ఆ సాంగ్‌ను తొల‌గించారు. బెల్లంకొండ సురేశ్ పక్కన పెట్టిన ఆ పాటను ఇప్పుడు సినిమాకు మ‌ళ్లీ జోడించ‌నున్నారు.


అయితే సౌండ్ లేకుండా ఉన్న పాత విజువల్స్ మాత్రమే లభ్యం అయ్యాయి. దాంతో బాల‌య్య డాన్స్ విజువ‌ల్స్ కు అనుగుణంగా కొత్తగా సాంగ్ రాయించారు. ప్రఖ్యాత గేయ రచయిత చంద్రబోస్ లిరిక్స్ అందించగా, భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు. స్వరాగ్ కీర్తన్ ఈ సాంగ్ ను ఆలపించారు. `మ్యాన్షన్ హౌస్ వేసినాడు మహానుభావుడు` అంటూ సాగే ఈ సాంగ్ తాజాగా మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఈ కొత్త పాట‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: