బాలీవుడ్‌లో కామెడీ కింగ్‌గా పేరు తెచ్చుకున్న నటుడు గోవింద మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. కానీ ఈసారి కారణం సినిమా కాదు – ఆయన వ్యక్తిగత జీవితం. మూడు దశాబ్దాలుగా కాపురం కొనసాగించిన భార్య సునీతతో విడాకుల బాట పట్టినట్టు సమాచారం. ఈ వార్త బాలీవుడ్ లోపల, బయట పెద్ద షాక్ లా మారింది. సమాచారం ప్రకారం, సునీత తాజాగా బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. తన పట్ల గోవింద అన్యాయంగా, క్రూరంగా ప్రవర్తిస్తున్నాడని, కుటుంబ బంధాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాడని ఆమె ఆరోపించింది. అంతేకాదు, గోవిందకు ఒక మరాఠీ నటితో సన్నిహిత సంబంధం ఉందన్నది సునీత ప్రధాన ఆరోపణ.


ఆ నటి వయసు సుమారు 30 ఏళ్లు అని, గత కొన్నేళ్లుగా ఆమెతో గోవిందకున్న దగ్గరితనం వారి కుటుంబంలో కలకలం రేపిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గోవింద – సునీత వైవాహిక బంధం పగుళ్లు పడిందనే వార్తలు చాలాసార్లు మీడియాలో వచ్చినా, ప్రతి సారి వారు వాటిని ఖండిస్తూ వచ్చారు. కానీ ఈసారి మాత్రం పరిస్థితి మరింత సీరియస్ గా మారినట్టు కనిపిస్తోంది. సునీత విడాకుల కోసం న్యాయపరంగా ముందడుగు వేయడంతో, ఈ జంట ఇక మళ్లీ కలిసే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న మరో కథనం ఏమిటంటే – సునీత తన ఫ్రెండ్స్ సర్కిల్ లో గోవిందపై విపరీత అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “ఇక సహించలేను” అని పరోక్షంగా చెప్పిందట.


 దీంతో విడాకుల కోసం దరఖాస్తు చేయడం కేవలం టైమ్ మేటర్ మాత్రమే అయిందని అర్థమవుతోంది. గోవింద వయస్సు దాదాపు 60 ఏళ్లు అయినా, ఆయన వ్యక్తిగత జీవితంలో ఇలాంటివి జరగడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకవైపు సినిమాల ఆఫర్లు తగ్గిపోతున్న తరుణంలో, మరోవైపు కుటుంబంలో ఇలాంటి కలకలం రావడం గోవిందకు కఠిన పరిస్థితిని తెచ్చిపెట్టిందని అంటున్నారు. ప్రస్తుతం ఈ విడాకుల వ్యవహారం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. గోవింద నుంచి ఎలాంటి స్పందన రాలేదు కానీ, సునీత లీగల్ గా అడుగు వేసిన తర్వాత మాత్రం ఈ విషయం గంభీర దశలోకి వెళ్లిందని అనుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: